Reading Time: 3 minutes
Chairmans Desk About Why Questioning Matters In Democracy Gen Z Protests And Youth Power

Chairman’s Desk: ఎక్కడైనా ఉద్యమం అంటే ఉవ్వెత్తున లేచే ప్రజా తరంగం. కచ్చితంగా ఏదో ఒక బలమైన కారణంతోనే ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఈ కారణాలు ప్రతిసారీ నిర్మాణాత్మకంగా ఉండాలనే రూలేం లేదు. ఒక్కోసారి సంఘ వ్యతిరేక శక్తుల ప్రోద్బలంతోనూ కొన్ని ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసి.. క్రమంగా విధ్వంసానికి దారితీస్తాయి. అందుకే ప్రతి ఉద్యమాన్ని ఒకే దృష్టితో చూడటం కుదిరే పని కాదు. ఇక్కడ ఉద్యమం ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకుంటూనే.. ఉద్యమం ప్రస్తుత తీరుతెన్నుల్ని గమనంలోకి తీసుకుని ఉద్యమాల విషయంలో ప్రభుత్వాలు కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ ఉద్యమం అనగానే అది శాంతిభద్రతల దృష్టితో చూసి.. మరీ కఠిన అణచివేతలకు పాల్పడటం.. అలాగే ఉద్యమాన్ని మరీ ఉదారవాద కోణంలో చూసి.. తీరా ఉద్యమ ఉధృతి పెరిగి.. అది జనజీవితాలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి వచ్చాక.. తీరిగ్గా విచారించడం రెండూ తప్పే. ప్రాథమికంగా ఉద్యమం అనేది ప్రశ్న యొక్క విస్తృత స్వరూపం. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే కచ్చితంగా ప్రశ్నించే తత్వం అవసరం. ఈ ప్రశ్నించేవారే రేపు బలమైన నేతలుగా ఎదుగుతారు. అలాగే తమ ప్రశ్నించే తత్వంతో వ్యవస్థల్లో లోపాల్ని సరిదిద్దుతారు. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

ఇక ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఉద్యమాల్ని, అందునా యువత ఉద్యమించే సందర్భాల్ని ప్రత్యేకంగా చూడాలి. ఇక్కడ ఉద్యమ నేపథ్యాన్ని చాలా జాగ్రత్తగా అంచనా వేయాలి. ఆ తర్వాత ఉద్యమ నాయకత్వం, ఉద్యమంలో పాల్గొనే సమూహాల ఆలోచనలు అన్నింటినీ పక్కాగా బేరీజు వేసి.. తగిన కార్యాచరణ తీసుకోవాలి. ప్రభుత్వం చేయాల్సిన పని ఇదే. ఇంకా చెప్పాలంటే అసలు ఉద్యమం రాకముందే జాగ్రత్తపడాలి. ఆ ఉద్యమానికి దారితీసే పరిస్థితుల్ని ముందే చక్కదిద్దుకుంటే.. ఉద్యమాలకు ఆస్కారం ఉండదు. పోనీ ఉద్యమం వచ్చాకైనా తొలినాళ్లలోనే ఉద్యమకారులతో సామరస్యంగా వ్యవహరిస్తే.. వారిలో కాస్త ఆవేశం తగ్గే సూచనలుంటాయి. అంటేకానీ ఉద్యమం తారస్థాయికి చేరేదాకా ఉపేక్షించి.. అప్పుడు సడెన్‌గా తెలివి తెచ్చుకుని ఎంతగా అణచివేయాలని చూసినా.. అది వృథా ప్రయాసగా మిగిలే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ తాత్కాలికంగా ఉద్యమాన్ని నియంత్రించగలిగినా.. అలాంటి వ్యవహారశైలి.. మరింత మంది తటస్థుల్ని ఉద్యమం దిశగా ప్రేరేపిస్తుందనే సంగతి మర్చిపోకూడదు.

దేశమంతా ఇప్పుడు ఒకే సబ్జెక్ట్ మీద చర్చ నడుస్తోంది. జెన్ జీలు. కాక్రోచ్ ఉద్యమాలు.. జెన్‌జీలను కొంతమంది విమర్శిస్తుంటే, కొంతమంది సమర్థిస్తున్నారు. కొంతమంది ఖండిస్తున్నారు. కానీ స్థూలదృష్టితో చూసినపుడు.. జెన్‌జీలు, జెన్‌ జీ ఉద్యమాలు సమాజంలో వచ్చిన మార్పుగా, ఒకమంచి సంప్రదాయంగానే భావించాలి. ఇది ప్రధాని మోడీకో, బీజేపీకో వ్యతిరేకం అనుకోవద్దు. దేశంలో కొన్ని దశబ్దాల తర్వాత మళ్లీ ప్రశ్నించే తరం ముందుకొచ్చిందనే విషయం గుర్తించాలి. ప్రతి సమాజంలోనూ ప్రశ్న ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రశ్నించడమే ఒక గొప్ప సంప్రదాయం. అది ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్షణం కూడా. ప్రశ్నించలేని దేశంలో ప్రజాస్వామ్యం ఉండి ఏం ఉపయోగం. రెండు, మూడు దశాబ్దాలుగా.. ఈ దేశంలో ప్రజా ఉద్యమాలు లేవు. ప్రశ్నించే గొంతులు కూడా లేవు. వామపక్షవాదం క్రమంగా బలహీన పడిపోయింది. జనం నిస్సత్తువలో ఉన్నారు. యువత అయితే ఉద్యోగాలు సంపాదించే చదువులు మాత్రమే చదువుకోవడం. ఉద్యోగాలు చేయడం. ఈఎంఐలు కట్టుకోవడంతోనే ఒక తరం వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో.. జెన్‌ జీలు, కాక్రోచ్‌లు మళ్లీ గొంతు వినిపిస్తున్నారు. వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారు. యువత కచ్చితంగా ప్రశ్నించాలి. సమాజంలో ప్రశ్న ఉండాలి. ప్రశ్నించే తత్వం ఉండాలి. అందువల్ల దీనిని ప్రధాని మోడీ స్వాగతించాలి. బీజేపీతో పాటు అన్ని పార్టీలు ఈ ప్రశ్నించే తత్వాన్ని స్వాగతించాలి. ఇప్పుడు జరుగుతున్న జెన్‌ జీ, కాక్రోచ్ ఉద్యమాలు ప్రభుత్వానికి వ్యతిరేకం అనే భావన విడిచిపెట్టాలి.

ఇక్కడ ఉద్యమించేవారు కూడా ఈ దేశ పౌరులే. అందులోనూ విద్యార్థులు. సాధారణంగా విద్యార్థులు ఇంత రిస్క్‌ చేసి బయటకు రావడం అరుదు. అలాంటి వారు కూడా ఈ స్థాయిలో ఉద్యమిస్తున్నారంటే.. వారి మనసుల్లో ఎన్నో ఏళ్లుగా గూడు కట్టుకున్న ఆవేదనకు ప్రతిరూపమే ఉద్యమమని అర్థం చేసుకోవాలి. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. ఉద్యమం పేరుతో జెన్‌జీ గొంతెమ్మ కోర్కెలు ఎక్కడా కోరటం లేదు. ప్రభుత్వాల్ని కూలదోసే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. కేవలం నిర్దిష్టమైన అంశాలు ప్రస్తావించి.. వాటికి పరిష్కారాలు చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో చాలా హేతుబద్ధత ఉంది. అంతేకాకుండా నిర్దిష్టమైన దిశ, దశ కూడా ఉంది. కానీ ఒక్కసారి ఉద్యమం గ్రౌండయ్యాక.. అప్పుడు రాజకీయ శక్తులు రంగప్రవేశం చేసి.. ఉద్యమ లక్ష్యాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. పైగా జెన్‌జీకి మద్దతిచ్చినట్టే ఇస్తూ.. వారిపై అనవసరంగా తమ రాజకీయ ఆకాంక్షల్ని రుద్దుతున్నారు. ఇక్కడే అనివార్యంగా ఘర్షణ వస్తోంది. ఒక్కసారి ఘర్షణ వాతావరణం వచ్చాక.. ప్రభుత్వం వారిని శత్రువులుగా చూస్తోంది. వారూ సర్కారును అలాగే చూస్తున్నారు. ఇక్కడే తేడా వస్తోంది.

నిజానికి ఉద్యమాలు చేయడం అంత తేలిక కాదు. ఉద్యమ సందర్భం, నిర్మాణం, కొనసాగింపు, మగింపు.. ఇలా ప్రతి దశ వెనుకా కచ్చితమైన వ్యూహం ఉండాలి. ఏ దశలోనూ ఉద్యమం దారి మళ్లకుండా జాగ్రత్తపడాలి. అలాగే సర్కారు కూడా జెన్‌జీ ఉద్యమం విషయంలో మరీ దుకుడుగా వెళ్లకుండా.. వారి సహేతుక డిమాండ్లు పరిష్కరించే ప్రయత్నించాలి. ఆమాటకొస్తే నీట్‌ లీకేజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన జెన్‌జీ.. మొదట్లో ఎవరి రాజీనామానూ కోరలేదు. కేవలం పరీక్ష సంస్కరణల కోసమే డిమాండ్ చేసింది. కానీ సర్కారు త్వరగా స్పందించకపోవడంతో.. అప్పుడే కేంద్రమంత్రి రాజీనామా డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఉద్యమం కాస్త గతి తప్పింది. నిజానికి వ్యక్తుల రాజీనామాల కంటే వ్యవస్థల్లో లోపాలు చక్కదిద్దటమే ప్రాధాన్యాంశం. కానీ మంత్రి రాజీనామా చేస్తేనే ఉద్యమం ఆపేస్తామన్న సింగిల్ పాయింట్ అజెండా పట్టుకోవడంతో.. సర్కారు మంత్రితో రాజీనామా చేయించింది. ఉద్యమం కూడా నిలిపేయాల్సి వచ్చింది. కానీ ఇలా ఉద్యమానికి ముగింపు ఇవ్వడం చాలా మంది విద్యార్థులకు నచ్చలేదు. అందుకే మొన్న సీఈసీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తమను నీట్ విషయంలో మోసం చేశారని కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఏతావాతా ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే ఉద్యమ ప్రయోజనాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఎవరు ఎటువైపు తప్పటడుగు వేసినా.. పవిత్రమైన ఆశయానికి చెదలు పట్టే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుండా.. తమకు తామే ఉద్యమించి వ్యవస్థల్ని చక్కదిద్దాలని విద్యార్థులు నడుం కట్టారు. దాదాపు 2-3 దశాబ్దాలుగా సైలంట్‌గా ఉన్న ఈ దేశపు యువత ఇఫ్పుడు ఉద్యమాలతో క్రియాశీలం కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఉద్యమంలో రాజకీయాల్ని పక్కనపెట్టి.. అసలు సిసలు ఉద్యమ లక్ష్యం దిశగా కార్యాచరణ తీసుకుంటే మరింత ఫలితం ఉంటుంది. అంతేకాదు అటు జెన్‌జీలోనూ కొత్త స్ఫూర్తి నిండుతుంది. ఇవన్నీ పక్కనపెడితే.. రేపటి మెరుగైన దేశ భవిష్యత్తుకు.. జెన్‌జీ ఊపిరిపోయగలదనే కొత్త విశ్వాసం దేశ ప్రజల్లోనూ ఇనుమడిస్తుంది. అలా చూసినప్పుడు ఉద్యమాన్ని సానుకూలంగా చూడాలే కానీ.. ఇదేదో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం అని సర్కారు అనుకోవాల్సిన పనేం లేదు.