Reading Time: 2 minutes
CP Sajjanar: ఇలా చేస్తే చూస్తూ ఉండిపోకండి.. ప్రయాణికులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

ట్రాఫిక్ నిబంధనలను పెడచెవిన పెట్టి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు, హెడ్‌ఫోన్లు వాడటం వల్ల జరిగే ప్రమాదాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వీడియోను పంచుకుంటూ, వాహనదారులతో పాటు ప్రయాణికులకు కూడా కీలక సూచనలు జారీ చేశారు.

తనకు ఓ నెటిజన్ పంపిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సీపీ సజ్జనార్ ఆ డ్రైవర్ నిర్వాకాన్ని వివరించారు.. రెండు కళ్ల ముందు రెండు మొబైల్ ఫోన్లు పెట్టుకుని, ఒకదానిలో నేవిగేషన్ రూట్ చూస్తూ, మరోదానిలో సినిమా నడుపుతూ ఆటో నడుపుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. అంతేకాకుండా, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా రంగురంగుల లైట్లు వెలిగే పెద్ద హెడ్‌ఫోన్లను డ్రైవర్ చెవులకు తగిలించుకున్నాడు. చూడటానికి ఇది మల్టీ-స్క్రీన్ గేమింగ్ విన్యాసంలా అనిపించినా, వెనుక కూర్చున్న ప్రయాణికుల పాలిట మాత్రం అది నడుస్తున్న మృత్యుశకటం అని సజ్జనార్ పేర్కొన్నారు.

డ్రైవింగ్ సమయంలో రోడ్డుపై నుంచి దృష్టి క్షణకాలం పక్కకు మళ్లినా ఘోర ప్రమాదాలు ముంచుకొస్తాయని సీపీ గుర్తుచేశారు. అలాంటిది నేరుగా సినిమా చూస్తూ, హెడ్‌ఫోన్లు పెట్టుకుని వాహనం నడపడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇది డేంజరస్ డ్రైవింగ్ కిందకు వస్తుందని, ఇటువంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుందని హెచ్చరించారు. వినోదం కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని, ఆటోను థియేటర్‌గా మార్చి జీవితాలకు ది ఎండ్ కార్డు వేయొద్దని స్పష్టం చేశారు.

ప్రయాణికులకూ కీలక సూచనలు

టూవీలర్, కారు, ఆటో, బస్సు, లారీ.. వాహనం ఏదైనా సరే డ్రైవింగ్ సమయంలో మొబైల్, హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్ వాడటం ప్రాణాంతకమని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రయాణికులు కూడా బాధ్యతగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రయాణించే సమయంలో డ్రైవర్ ఫోన్ చూస్తున్నా, హెడ్‌ఫోన్లు లేదా ఇయర్‌బడ్స్ వాడుతున్నా చూస్తూ మౌనంగా ఉండకండి.అది ప్రాణాలకే ప్రమాదకరమని వెంటనే ప్రశ్నించి, వారిని వారించండి.చెప్పినా వినకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

ప్రయాణంలో మనం చూపించే చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు తెస్తుందని, అదే సమయంలో చూపే అప్రమత్తత ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడుతుందని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.