
సోషల్ మీడియాలో యువతి తన డేటింగ్ అనుభవం గురించి పోస్టు చేసింది. తనతో మొదటి డేట్‌ను ఆ వ్యక్తి చాలా విలాసవంతంగా ప్లాన్ చేశాడని తెలిపింది. తనను తీసుకెళ్లేందుకు లగ్జరీ కారును ఏర్పాటు చేయడంతో పాటు, మిచెలిన్ స్టార్ గుర్తింపు ఉన్న రెస్టారెంట్‌లో ముందుగానే టేబుల్ బుక్ చేశాడని వివరించింది. డేట్ సమయంలో తనను ఎంతో ప్రత్యేకంగా చూసుకున్నాడని, కారు డోర్లు తెరవడం నుంచి భోజనానికి సంబంధించిన ఏర్పాట్ల వరకు అన్నీ చూసుకున్నాడని తెలిపింది. రెస్టారెంట్‌లో తనకు నచ్చిన వంటకాలను ఆర్డర్ చేస్తూ, ఆ సాయంత్రం మొత్తం ఎంతో శ్రద్ధ చూపించాడని తెలిపింది. ఆ సమయంలో తనకు ఎంతో భద్రతగా, సౌకర్యంగా అనిపించిందనీ, అయితే, ఇంత చేసినా అతడితో సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాత్రం ఆమెకు అనిపించలేదనీ రాసుకొచ్చింది.
బట్టతల ఉందని ఫ్రెండ్ జోన్!
ఆ వ్యక్తితో భవిష్యత్తులో ప్రేమ సంబంధం కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు యువతి తన పోస్టులో బయటపెట్టింది. అందుకు అతడికి బట్టతల ఉండటమే కారణం అంది. దాంతో ఖరీదైన డేట్ ఏర్పాటు చేసిన వ్యక్తిని అతడి రూపం కారణంగా తిరస్కరించడం సరైందేనా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, కథ ఇక్కడితో ముగియలేదు. యువతి మరో పోస్టులో ఖర్చు చేసిన 1,050 డాలర్లు.. అంటే రూ.లక్ష తిరిగి ఇవ్వాలని అడిగినట్లు ఆ వ్యక్తితో జరిపిన సంభాషణ స్క్రీన్‌షాట్‌ను పంచుకుంది. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చకు దారితీసింది.
Chivalry is dead. https://t.co/6xkoCZSDC1
— Raq (@raqisright) October 10, 2026
డేట్‌కు ఖర్చు చేస్తే ప్రేమించాల్సిందేనా?
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు యువతి తీరును తప్పుబడుతున్నారు. ఒక వ్యక్తి తన కోసం ఇంత ఖర్చు చేసి, ఎంతో ప్రత్యేకంగా చూసుకున్న తర్వాత అతడి రూపం నచ్చలేదని తిరస్కరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అతడు ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి అడగడానికి దారితీసిన పరిస్థితిపై కూడా చర్చిస్తున్నారు. మరోవైపు, డేట్‌కు ఎంత ఖర్చు చేసినా ఎదుటి వ్యక్తి ప్రేమను పొందే హక్కు ఎవరికీ లేదని మరికొందరు అంటున్నారు. ఒకరికి మరొకరు నచ్చకపోతే సంబంధాన్ని కొనసాగించకపోవడం వారి వ్యక్తిగత నిర్ణయమనీ, డేట్‌ను ఏర్పాటు చేసుకుని ఖర్చు చేయాలని నిర్ణయించుకున్న వ్యక్తి, ఆ డబ్బుకు బదులుగా ప్రేమను ఆశించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఈ ఘటనతో డేటింగ్‌లో ఖర్చు, వ్యక్తిగత అభిరుచులు, ప్రేమపై అంచనాలు మరోసారి చర్చకు వచ్చాయి. ఖరీదైన డేట్ అంటే ప్రేమకు హామీనా? లేక ఇద్దరికీ నచ్చితేనే సంబంధం ముందుకు సాగాలా? అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసాయి.