
55 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచన ఎంతో ఆకర్షణీయంగా అనిపించినా.. 60 ఏళ్లకు రిటైర్ కావడానికి, 55 ఏళ్లకు అవ్వటానికి మధ్య ఆర్థిక లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సాధారణంగా 55 ఏళ్లకే ఉద్యోగ విరమణ చేస్తే.. సంపాదన కోసం మీకు తక్కువ సంవత్సరాలు మిగులుతాయి. కానీ ఆ కూడబెట్టిన డబ్బును మరో 3 దశాబ్దాల కంటే ఎక్కువ కాలం పాటు మీ జీవితాన్ని నడిపించాల్సి ఉంటుంది. అలాగే మీరు పని చేయడం మానేసిన తర్వాత కూడా ద్రవ్యోల్బణం కారణంగా ఇంటి అవసరాలు, వైద్య ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి.
నెలవారీ ఖర్చులతోనే:
ప్రతి ఒక్కరికీ సరిపోయే ఒకే రకమైన రిటైర్మెంట్ కార్పస్ ఉండదు. మీ ప్రస్తుత ఖర్చులు, అంచనా వేసిన ద్రవ్యోల్బణం, అద్దె.. పెన్షన్ వంటి ఇతర ఆదాయాలు, హెల్త్ ఇన్సూరెన్స్, పెట్టుబడి రాబడులు అన్నీ ఈ మొత్తాన్ని మారుస్తుంటాయి. రిటైర్మెంట్ తొలి సంవత్సరంలో మీకు ఏడాదికి ఎంత ఖర్చు అవసరమవుతుందో లెక్కగట్టి, అక్కడి నుంచి వెనక్కి లెక్కించడం ఒక చక్కని ప్రారంభం. ఉదాహరణకు.. ఒక ఫ్యామిలీ ప్రస్తుతం నెలకు రూ.60వేలు ఖర్చు చేస్తోందనుకుందాం. ద్రవ్యోల్బణం సగటున 6 శాతం ఉంటే.. ఐదేళ్ల తర్వాత అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలంటే సుమారు రూ.80వేలు అవసరమవుతుంది. అంటే పెద్ద వైద్య ఖర్చులు, ఇతరత్రా అనూహ్య ఖర్చులు కాకుండా కేవలం తొలి ఏడాదిలో రిటైర్మెంట్ ఖర్చే సుమారు రూ.9లక్షల 60వేలకు చేరుకోవచ్చు.
20 ఏళ్ల రిటైర్మెంట్ ఆలోచన సరిపోదు:
55 ఏళ్లకు రిటైర్ అయ్యే వారు తమ కార్పస్ కేవలం 75 ఏళ్ల వరకు వస్తుందని భావించకూడదు. కనీసం 85 లేదా 90 ఏళ్ల వరకు జీవిస్తామనే అంచనాతో ప్లాన్ చేసుకోవడం సేఫ్. పెన్షన్ లేని సందర్భంలో ఇది మరింత ముఖ్యం. పింఛన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకారం.. సుదీర్ఘ రిటైర్మెంట్ కాలంలో ద్రవ్యోల్బణానికి తగినట్లుగా ఆదాయం అందాలంటే నిధుల ఉపసంహరణ రేట్లను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. కేవలం వార్షిక ఖర్చులను 20తో గుణించడం సరిపోకపోవచ్చని నిపుణుల మాట.
టార్గెట్ కార్పస్‌ను అంచనా వేయడం ఎలా?
మెుదటి ఏడాది రిటైర్మెంట్ ఖర్చులు రూ.9లక్షల 60వేలు అనుకుంటే.. దీనికి 25 రెట్లు అంటే రూ.2కోట్ల 40 లక్షల కార్పస్ అవసరమవుతుంది. అదే 30 రెట్లు అయితే ఆ మొత్తం రూ.2కోట్ల 88లక్షలకు చేరుకుంటుంది. అయితే ఇవి కచ్చితమైన రూల్స్ కావు. మీకు పెన్షన్, అద్దె, ఇతర పెట్టుబడుల ద్వారా నమ్మదగిన ఆదాయం ఉంటే ఈ మొత్తం తగ్గవచ్చు. ఒకవేళ ఖర్చులు వేగంగా పెరిగినా, మీద ఆధారపడిన వారున్నా, వైద్య ఖర్చుల కోసం ఎక్కువ రిజర్వ్ కోరుకున్నా ఈ మొత్తం మరింత పెరగవచ్చు.
మీరు ఉద్యోగానికి స్వస్తి చెప్పే ముందు మీ కుటుంబం నిజంగా ఎంత ఖర్చు చేస్తోంది.. 55 ఏళ్లకు ఆ ఖర్చులు ఎంత పెరుగుతాయి, రిటైర్మెంట్ తర్వాత వచ్చే నమ్మదగిన ఆదాయం ఎంత అని బేరీజు వేసుకోవాలి. చాలా మందికి అసలు సమస్య 5 ఏళ్లు ముందుగా రిటైర్ కావడం కాదు, ఆ డబ్బు ఎంతకాలం వస్తుంది అనే అంచనా వేయడంలో విఫలమవడమే. 60 ఏళ్ల వయసులో సరిపోయే ప్లాన్.. 55 ఏళ్లకు మరింత పెద్ద కుషన్‌ను కోరుకుంటుందని గుర్తించండి. లెక్కలు ఎంత పక్కగా అంచనా వేయగలిగితే జీవితంలో ఆఖరి మజిలీ అంత సాఫీగా సాగిపోతుంది.