
Story Board: ఏపీలో స్థానిక ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. దీంతో మరోసారి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఇప్పుడు జరిగేది పేరుకి స్థానిక ఎన్నికలే అయినా.. మధ్యంతర ఎన్నికల తరహా రాజకీయ వేడి ఉంటుంందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీలన్నీ స్థానిక ఎన్నికల కోసం వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధం కావడం.. మేయర్, జడ్పీ ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు వంటి అంశాలు.. స్థానిక సమరాన్ని ఖరీదైన పోరుగా మార్చేస్తాయనే అంచనాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని పక్కనపెట్టి.. ప్రస్తుతం ఏ పార్టీ బలబలాలు ఎలా ఉన్నాయో సరి చూసుకోవటానికి స్థానిక సమరం ఉపయోగపడుతుందనే అభిప్రాయాలున్నాయి. అదే సమయంలో స్థానిక ఎన్నికల గెలుపోటములతో సంబంధం లేకుండా సరైన సన్నద్ధతతో ఉంటే.. ఏమైనా లోటుపాట్లుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి వాటిని దిద్దుకోవచ్చనే వాదన కూడా లేకపోలేదు. ఇలా ఈసారి ఏపీ స్థానిక ఎన్నికలకు ఎక్కడలేని రాజకీయ ప్రాధాన్యత వచ్చేసింది. ఇంతకూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు సాధించిన ఓట్ల శాతం.. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా.. ఏదైనా మార్పు ఉంటుందా.. అనేది తేలాల్సి ఉంది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ 80 నుంచి 90 శాతం సీట్లు సాధించే అవకాశం ఉండటం.. సాధారణమే. సహజంగానే యంత్రాంగం కూడా అధికార పార్టీకి సహకరిస్తుంది కాబట్టి.. ఏకగ్రీవాలు కూడా జోరుగానే అవుతాయి. అలాగని స్థానిక సమరాన్ని తేలిగ్గా తీసుకోవటానికి విపక్షం సిద్ధంగా లేదు. అందుకే వైసీపీ అధినేత జగన్ ఏకగ్రీవాలైనచోట.. నియోజకవర్గ ఇంఛార్జులు ఎమ్మెల్యే టికెట్లపై ఆశలు వదులుకోవాలని తేల్చిచెప్పారు. ఆమాటకొస్తే.. స్థానిక ఎన్నికల ఫలితాలను సీరియస్‌గా తీసుకోవటం కూడా కుదిరే పని కాదు. ఎందుకంటే 2019-24 మధ్యకాలంలో జరిగిన స్థానిక పోరులో వైసీపీ 90 శాతం పైగా సీట్లు సాధించింది. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి కేవలం 11 సీట్లు సాధించి.. పూర్తిగా చతికిలపడింది. మొత్తం మీద స్థానిక పోరుతో.. ఏపీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఎప్పుడూ లేనంత ఉత్కంఠకు తెరతీస్తున్న స్థానిక ఎన్నికలు.. నెల రోజుల పాటు.. రాష్ట్రంలో గ్రామగ్రామాన నరాలు తెగే ఉత్కంఠను అందిస్తాయనడంలో సందేహం లేదు.
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకటన వెలువడే రోజే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కీలకమైన స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేస్తూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ వివరాలను వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందించనుంది. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి రాష్ట్రంలోని 20 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలను దశలవారీగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయనుంది. షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి రానుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మూడో రోజు నుంచి మున్సిపాలిటీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కేవలం 16 రోజుల్లో పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మొత్తం 14 రోజుల్లోనే పూర్తి చేసేలా అధికారులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. వీటన్నింటికి వేర్వురుగా షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒక దశలోనే నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. పంచాయతీలకు మాత్రం పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తరువాత వీటిలో ఓట్లు లెక్కించనున్నారు.
పంచాయతీ ఎన్నికలు మినహా మిగిలిన స్థానిక ఎన్నికలన్నీ పార్టీ పరంగా నిర్వహిస్తారు. నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ఏది ముందు వెలువడితే.. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికలకు మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం.. ఫొటోతో కూడిన పూర్తి స్థాయి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయించారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేయటంలో ఎలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ముందే స్పష్టం చేశారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 11వ తేదీ సంబంధిత మండల పరిషత్ కార్యాలయాలు, ఇతర నిర్దేశిత కేంద్రాల్లో నోటీస్ బోర్డులలో ప్రదర్శించారు. ఓటర్లు తమ పేర్లు ఓటరు జాబితాలో సరిచూసుకునేందుకు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఏవైనా ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు ఇది ఉపకరించనుంది. మరోవైపు ఏపీలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 23, 24వ తేదీలతో ముగిసింది. ఈ తరుణంలో పాలనాపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, సకాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
ఏతావాతా ఏపీలో స్థానిక ఎన్నికలకు అటు ఎస్‌ఈసీ, ఇటు పార్టీల వైపు నుంచి పూర్తిస్థాయి సన్నద్ధత కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీల కింది స్థాయి క్యాడర్ కూడా పూర్తిస్థాయిలో స్థానిక ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లోనే కింది స్థాయి క్యాడర్‌కు ఎక్కువగా పదవులు దక్కే అవకాశం ఉండటంతో.. ఈ ఎన్నికలు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా కీలకం కానున్నాయి. ఈ ఎన్నికలు వీరి దగ్గర నుంచి సరైన సహాయ సహకారాలు అందకపోతే.. ఆ ప్రభావం రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మీద ఉంటుందనడంలో సందేహం లేదు. దీనికి తోడు ఇప్పటికే పార్టీల అధిష్ఠానాల నుంచి ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు వచ్చాయి. ఎవరి నియోజకవర్గంలో వారు బాధ్యత తీసుకుని మెజార్టీ సీట్లు గెలిచేలా కృషిచేయాలనే ఆదేశాలు వచ్చాయి. అలా చూసుకున్నప్పుడు.. ఓవైపు అధిష్ఠానాల హెచ్చరికలు, మరోవైపు కింది స్థాయి క్యాడర్ నుంచి ఒత్తిడితో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బాగా టెన్షన్ పడుతున్నారు. ఎవరికి వారు తమవైపు నుంచి ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నిక్లలో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఆ ఓట్ల శాతాన్ని వైసీపీ ఎంతవరకు నిలబెట్టుకుంటుందనేది ఇప్పుడు కీలకం కానుంది. 2019-24 మధ్య స్థానిక ఎన్నికల్లో అప్పుుడ విపక్షంగా ఉన్న టీడీపీ పోటీ చేయలేదు. కానీ ఈసారి విపక్షం వైసీపీ స్థానిక సమరాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాల మాటే వినిపించొద్దని ఇప్పటికే జగన్ తమ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. గెలుపోటములతో సంబంధం లేకుండా బలమైన అభ్యర్థులు బరిలో నిలిపి.. గట్టిగా పోరాడాలని దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచినా.. ఆ గెలుపు మాత్రం అంత తేలికగా దక్కకూడదనేది వైసీపీ వ్యూహంగా ఉంది. దీనికి తోడు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్న మేయర్, జడ్పీ ఛైర్మన్ పదవుల విషయంలోనూ ప్రత్యేక వ్యూహరచన ఉండాలని వైసీపీ కంకణం కట్టుకుంది.
అధికారం కోల్పోయిన దగ్గర్నుంచీ కొందరు ఇంఛార్జులు నామమాత్రంగా పనిచేస్తున్నారన్న నివేదికలు అందడంతో.. జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలకు జగన్ హితవు చెప్పిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోకపోవడంతో.. ఇక ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. దీనికి తోడు ఏపీలో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తైన తరుణంలో.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ఇది సరైన సందర్భమని జగన్ భావిస్తున్నారు. తద్వారా పాలక పక్షంపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో సంఘటితం చేయటానికి.. ప్రతిపక్షం ఎక్కడికక్కడ గట్టిగా పోరాడాలని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు 2029 ఎన్నికలకు కార్యాచరణ తేల్చుకోవటానికి కూడా స్థానిక సమరం కీలకంగా మారుతుందని జగన్ చెబుతున్నారు. అందుకే స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. నియోజకవర్గాల వారీగా పోస్ట్‌మార్టమ్ చేస్తామని కూడా జగన్ ముందే చెప్పేశారు. దీంతో స్థానిక ఎన్నికల సందర్భంగా ఏ పొరపాటు జరిగినా.. భారీ మూల్యం చెల్లించక తప్పదని వైసీపీ నేతలకు ఓ క్లారిటీ వచ్చేసింది.
అటు టీడీపీ కూడా అధికార పార్టీగా ఉన్న అడ్వాంటేజ్‌ను వాడుకోవడంతో పాటు విపక్షంపై స్పష్టమైన పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో పనైపోలేదు. స్థానిక ఎన్నికల్లోనూ గెలిచినప్పుడే విజయం సంపూర్ణమవుతుందని చంద్రబాబు ఇప్పటికే చెబుతున్నారు. అంతేకాదు ఏపీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఉండాలని ఢంకా బజాయిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవలంబించిన వ్యూహాలు అమలు చేసి.. ఇప్పుడు కూడా కూటమిలో ఐక్యత ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికే ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి కసరత్తు మొదలుపెట్టారు. ప్రతిపక్షానికి ఏ చిన్న అవకాశం ఇచ్చినా.. అది స్వీయ తప్పిదమే అవుతుందనే సంగతి గుర్తుంచుకోవాలని నేతలకు గట్టిగా చెబుతున్నారు. స్థానిక సమరంలో పాలక పక్షానికి ఉండే సహజ అనుకూలతను ఉపయోగించుకుని.. సత్తా చాటాలని హితబోధ చేస్తున్నారు. అంతేకాకుండా కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న సానుకూలతను క్యాష్ చేసుకుని.. అత్యధిక సంఖ్యలో స్థానాలు గెలవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా ఇటు కూటమి, అటు వైసీపీ స్థానిక సమరాన్ని సీరియస్‌గా తీసుకుంటుండటంతో.. లోకల్ ఎలక్షన్ హీట్ తారస్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన గ్రామ స్థాయి నుంచి పై వరకూ ఎన్నికల హడావుడి కొట్టొచ్చినట్టు కనిపించడం ఖాయమే. మొత్తం మీద ఏపీలో ఈసారి స్థానిక సమరం కూడా రాజకీయ పందెంరాయుళ్లకు పంట పండిస్తుందనే అంచనాలున్నాయి. అలాగే ప్రత్యక్ష ఎన్నికలు జరిగే మేయర్, జడ్పీ ఛైర్మన్ పదవులు ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠకు దారితీస్తున్న అంశం. ఏపీలో ఐదేళ్లకోసారి రాజకీయ బలాబలాలు మారిపోతున్న తరుణంలో.. ఈసారి స్థానిక ఫలితాలు మామూలుగానే ఉంటాయా..? ఎక్కడైనా అనూహ్య ఫలితాలకు అవకాశం ఉందా..? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
ఏపీలో చాలా నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా నివురుగప్పిన నిప్పులా అలాగే ఉందనే వాదన ఉంది. అలాంటి తరుణంలో స్థానిక ఎన్నికల నగారా మోగితే.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటీవలి అరెస్టులు, కేసులు, విచారణల్ని కూడా దృష్టిలో పెట్టుకుని బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి కోర్టు కేసులు కూడా పెరుగుతాయనే అంచనాలతో అధికారులు సిద్ధమౌతున్నారు. గతంలో మాదిరిగా సాంకేతిక తప్పిదాలు జరగకుండా జాగ్రత్తపడాలని ఇప్పటికే ఎస్‌ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. ఈసారి స్వల్ప తేడాతో విజేతలు డిసైడయ్యే పరిస్థితులు ఉన్నచోట కూడా అప్రమత్తంగా ఉండాలనే సూచనలున్నాయి. ఇక ప్రత్యక్ష ఎన్నికలు జరిగే పదవుల విషయంలో కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల స్థాయి హైఅలర్ట్ అవసరమనే అభిప్రాయాలున్నాయి. స్థానిక ఎన్నికల్లో పార్టీల బలాబలాలతో పాటు స్థానిక పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఒక్కోచోట ఒక్కోమాదిరిగా రాజకీయ వాతావరణం ఉంటుంది. వీటన్నింటినీ గమనంలోకి తీసుకుని పార్టీలతో పాటు అధికార యంత్రాంగం కూడా తీవ్ర కసరత్తు చేయక తప్పదు. ఎక్కడ తేడా వచ్చినా.. ముందు అధికారులే బుక్కయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవడం.. కత్తి మీద సామే అంటున్నారు.