Reading Time: 2 minutes

అందరు అనుకున్నట్టు బిడ్డ ఆరోగ్యం ఒక్క తల్లి పైన మాత్రమే అదరపడలేదు. ఈరోజుల్లో సంతానం కోరుకునే దంపతులు ఇప్పటివరకు కేవలం కాబోయే తల్లి ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు. కానీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలలో తల్లితో పాటు తండ్రి ఆరోగ్యం కూడా అంతే కీలకమని ‘మెన్స్ హెల్త్’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. గర్భధారణకు ముందే తండ్రి శారీరక, మానసిక ఆరోగ్యం, అలవాట్లు బిడ్డ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జీవనశైలి, అలవాట్ల ప్రభావం: కాబోయే తండ్రి ఆహార అలవాట్లు, జీవనశైలితో పాటు మద్యపానం, పొగాకు వాడకం వంటి అంశాలు పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇక ముఖ్యంగా గర్భధారణకు ముందు తండ్రులు మద్యం సేవించడం వల్ల పిల్లల్లో కొన్ని రకాల పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం దాదాపు 35 శాతం వరకు పెరుగుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Why Men’s Health Matters Before Pregnancy: How a Father’s Lifestyle Affects Children
Why Men’s Health Matters Before Pregnancy: How a Father’s Lifestyle Affects Children

తండ్రి వయస్సు కూడా కీలకమే: కేవలం అలవాట్లే కాదు, తండ్రి వయస్సు కూడా బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో తండ్రులుగా మారే వారి పిల్లల్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, అలాగే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

తండ్రి మానసిక ఆరోగ్యం – డిప్రెషన్ ముప్పు: పురుషుల మానసిక ఆరోగ్యం బిడ్డపై నేరుగా ప్రభావం చూపుతుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న తండ్రుల పిల్లలకు కూడా భవిష్యత్తులో డిప్రెషన్ వచ్చే అవకాశం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక జన్యుపరమైన అంశాలతో పాటు ఇంటి వాతావరణం కూడా దీనికి కారణం కావచ్చు.

తండ్రులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు: కాబోయే తండ్రులు గర్భధారణకు ముందే తమ ఫిట్‌నెస్, మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టాలి. పౌష్టికాహారం తీసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా రాబోయే తరానికి మంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వవచ్చు.

సంతానోత్పత్తి అనగానే కేవలం మహిళల ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. గర్భధారణకు ముందు తల్లితో పాటు తండ్రి ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిగణించాలి. కాబోయే తండ్రులు తమ జీవనశైలిని మెరుగుపరుచుకోవడం ద్వారా తమ కుటుంబానికి, పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు.

గమనిక: పైన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, పిల్లల కోసం ప్లాన్ చేసుకునే సమయంలో దంపతులిద్దరూ ముందస్తుగా డాక్టర్ లేదా ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించి తగిన వైద్య పరీక్షలు, సలహాలు పొందడం శ్రేయస్కరం.

The post గర్భధారణకు ముందు పురుషుల ఆరోగ్యం ఎందుకు ముఖ్యం..? పిల్లలపై తండ్రి జీవనశైలి ప్రభావం ఇదే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.