
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం నిర్దేశించిన స్టైపెండ్‌కు, తమకు అందుతున్న వేతనానికి పొంతన లేకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నెలకు రూ.5 వేల స్టైపెండ్‌తో వైద్య సేవలు ఎలా అందించాలంటూ ప్రశ్నిస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. సమాన పనికి సమాన స్టైపెండ్ ఇవ్వాలనే న్యాయసూత్రం ప్రకారం తమకు పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మొత్తం 31 మంది జూనియర్ డాక్టర్లు ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు.
అర్హత ఉన్నా అందుతున్నది రూ.5 వేలే..
గత జూన్ నెల నుంచి ఇంటర్న్‌షిప్ విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన స్టైపెండ్ రూ. 29,792గా ఉండగా, క్షేత్రస్థాయిలో తమకు మాత్రం కేవలం రూ. 5 వేలు మాత్రమే అందుతున్నాయని వారు వాపోయారు. రోజుకు కేవలం రూ. 166 చొప్పున వస్తున్న ఈ నామమాత్రపు మొత్తంతో రోజువారీ కనీస అవసరాలు, ఇతర ఖర్చులు తీర్చుకోవడం అత్యంత కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ఎంబీబీఎస్ ఇంటర్న్‌లతో సమానంగా, రెగ్యులర్ డాక్టర్లతో పోటీపడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ, స్టైపెండ్ విషయంలో మాత్రం ఇంత భారీ వ్యత్యాసం ఉండటం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి
ఇతర ప్రాంతాల్లోని వైద్యులతో సమానంగా సేవలు అందిస్తున్న తమ పట్ల వివక్ష చూపడం తగదని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ సమస్యపై స్పందించి తక్షణ స్పష్టత ఇవ్వాలని కోరారు. తమకు రావాల్సిన బకాయిలను, పూర్తి స్థాయి స్టైపెండ్‌ను వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి సమస్యను పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఓపీ విధులను బహిష్కరించి ఫ్లకార్డులతో ఆసుపత్రి ప్రాంగణంలో వారు నిరసన తెలపడంతో వైద్యవర్గాల్లో చర్చనీయాంశమైంది.