
- నవంబరు 9న తుది జాబితా
- హైకోర్టుకు తెలిపిన ఈసీ
హైదరాబాద్, వెలుగు: ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లను తుది జాబితా నుంచి తొలగిస్తే అందుకు గల కారణాలను వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఈసీ హైకోర్టుకు తెలిపింది. నోటీసులకు స్పందించి విచారణకు హాజరై, వివరాల్లో వ్యత్యాసాలను సరిచేసేందుకు అవసరమైన పత్రాలు సమర్పించిన ఓటర్ల విషయంలో ఈ విధానం అనుసరిస్తామని స్పష్టం చేసింది.
కారణాలతో కూడిన ఉత్తర్వులపై అప్పీలు చేసుకోవచ్చని, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోతే సంబంధిత ఓటరు పేరు జాబితాలో చేర్చినట్లుగా పరిగణించవచ్చని వెల్లడించింది. ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ ప్రస్తుత జాబితాలో పేరు లేకపోతే తిరిగి నమోదు కోసం ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
ఆటోమేటిక్ డేటా మ్యాచింగ్ ద్వారా ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలను గుర్తించి నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్ కు చెందిన సామాజిక కార్యకర్త ఎస్.క్యూ. మసూద్, ఆయన సోదరుడు సయ్యద్ వహీదుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యామ్ కోషి, జస్టిస్ నందికొండ నర్సింగరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
మసూద్ పేరు ముసాయిదా జాబితాలో లేకపోవడంపై ఆయనకు సమగ్ర సమాధానం పంపినట్లు ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ తెలిపారు. మరో పిటిషనర్ వహీదుద్దీన్ పేరు ముసాయిదా జాబితాలో ఉన్నప్పటికీ, ఆయన తండ్రి పేరు విషయంలో వ్యత్యాసం గుర్తించి నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. అయితే నోటీసుకు స్పందించి పత్రాలు సమర్పించినా అధికారులు తమకు స్పష్టత ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదించారు.
ఏకపక్షంగా పేర్లు తొలగిస్తే అర్హులు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 326కు విరుద్ధమని పేర్కొన్నారు. పిటిషనర్ల పేర్లు తుది జాబితాలో కొనసాగుతాయో లేదో స్పష్టత లేనందున ప్రస్తుత పిటిషన్ను కొట్టివేయడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈసీ వివరణను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకునేందుకు పిటిషనర్ల న్యాయవాదికి అవకాశం కల్పించింది. తుది ఓటర్ల జాబితాను నవంబరు 9న ప్రచురించనున్నట్లు ఈసీ తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.