Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Srikkanth Criticises Indias Team Management

Krishnamachari Srikkanth on Vaibhav Sooryavanshi : భారత టీ20 జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు కొదవలేదు. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇదే సమయంలో యువ సంచలనం వైభవ్‌కు జట్టులో నిలకడగా అవకాశాలు ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్లేయింగ్ 11ను తరచూ మార్చే విధానం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని 1983 వన్డే ప్రపంచకప్ విజేత, మాజీ భారత క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వైభవ్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరును ఆయన విమర్శించాడు.

భారత జట్టు మేనేజ్‌మెంట్ సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీల విషయంలో స్పష్టమైన ప్రణాళికతో వ్యవహరించలేదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ వంటి జట్టుతో జరిగే మ్యాచ్‌ల్లో వైభవ్‌కు వరుసగా మూడు అవకాశాలు ఇచ్చి ఉండాల్సిందని పేర్కొన్నాడు. అభిషేక్ శర్మకు ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లభించినందున.. అతడికి విశ్రాంతినిచ్చి వైభవ్, సంజులను ఓపెనర్లుగా ఆడించవచ్చని సూచించాడు. ‘సంజు ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాదు.. వైభవ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా పూర్తిగా దెబ్బతీశారు. వెస్టిండీస్ వంటి జట్టుపై వైభవ్‌కు వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇచ్చి ఉండాల్సింది. అభిషేక్ శర్మను ఇప్పటికే చాలా కాలంగా చూశారు. కాబట్టి తదుపరి మ్యాచ్‌లో అతడికి విశ్రాంతినిచ్చి.. వైభవ్, సంజులను ఓపెనర్లుగా ఆడించవచ్చు’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.

వైభవ్ సూర్యవంశీకి తొలుత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం భారత జట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్‌తో రెండో టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు.. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులు చేశాడు. అయితే జింబాబ్వే పర్యటనలో తన ప్రతిభను చాటుకున్నాడు. వరుసగా 50, 20, 81 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ జట్టులో ఆటగాళ్ల ఎంపిక, మార్పుల విషయంలో స్పష్టత ఉండాలని శ్రీకాంత్ సూచించాడు. యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడం ద్వారా వారి సామర్థ్యాన్ని అంచనా వేయాలని అభిప్రాయపడ్డాడు.

సంజు శాంసన్ ప్రదర్శనలో నిలకడ కొరవడుతోందని శ్రీకాంత్ పేర్కొన్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో సంజు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత విజయాల్లో భాగస్వామి అయ్యాడు. ముఖ్యంగా టోర్నీ చివరి దశలో అతడి బ్యాటింగ్ ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత అతడి ఫామ్ తగ్గింది. ‘సంజు ఆట ఎప్పుడూ ఒడిదుడుకులతోనే ఉంటుంది. అతడి నిలకడపై ఎప్పుడూ ప్రశ్నలు ఉంటాయి. ప్రపంచ కప్‌లో ఒక్కసారిగా అద్భుతంగా ఆడతాడు. ఆ తర్వాత వరుసగా విఫలమవుతుంటాడు. అభిషేక్ శర్మలో మాత్రం ఇలాంటి తీవ్ర ఒడిదుడుకులు అంతగా కనిపించవు. ఇప్పుడు మళ్లీ తదుపరి మ్యాచ్‌లో సంజు పరుగులు చేస్తాడేమో’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. భారత టీ20 జట్టులో ఓపెనింగ్ స్థానాల కోసం అభిషేక్, సంజు, ఇషాన్, వైభవ్ మధ్య పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లను తరచూ మార్చడం కంటే.. వారికి నిర్దిష్టమైన పాత్రను అప్పగించి తగినన్ని అవకాశాలు ఇవ్వాలని శ్రీకాంత్ అంటున్నాడు.