Reading Time: 2 minutes
Brs Singareni Coal Belt Political Strategy Ramagundam Meeting

Off The Record: తెలంగాణలో సింగరేణి ప్రాంతానిది ప్రత్యేకమైన గుర్తింపు. ఇక్కడ కార్మిక, ఉద్యోగ వర్గాలు ఎక్కువ కాబట్టి రాజకీయ చైతన్యం కూడా ఎక్కువేనని చెబుతారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కోల్‌ బెల్ట్‌ కీలకంగా పని చేసింది. ఆ క్రమంలోనే… అప్పట్లో బీఆర్ఎస్‌ గట్టి పట్టు సాధించింది. అందుకు తగ్గట్టే గులాబీ ముఖ్య నేతల ఫోకస్‌ ఎక్కువగా ఇటువైపు ఉండేది. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా… సింగరేణి ప్రాంతంలోనే ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుచుకునేది. అలాంటి చోట గత ఎన్నికల్లో గులాబీకి గట్టి దెబ్బ తగిలింది. నిర్మొహమాటంగా చెప్పాలంటే… సింగరేణి ఏరియాలో బీఆర్‌ఎస్‌కు ఊహించని పరాభవం ఎదురైందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే కోల్‌ బెల్ట్‌ ఏరియాలో కారు పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. ఆసిఫాబాద్ నుంచి మాత్రమే బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గెలిచారు. ఈ పరిస్థితుల్లో… వచ్చే ఎన్నికల కోసం గట్టిగా వ్యూహరచన చేస్తోందట గులాబీ అధిష్టానం. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నట్టుగా.. సింగరేణి ఏరియా మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే…. కోల్‌ బెల్ట్‌లోని అసెంబ్లీ సీట్ల సంఖ్య 40కి పెరిగే అవకాశం ఉంది. ఆ లెక్కన రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ సీట్లలో మూడో వంతు ఉండే… సింగరేణి ప్రాంతం మీద ఇప్పట్నుంచే గురి పెడతామని అంటున్నారు బీఆర్‌ఎస్‌ లీడర్స్‌.

గత ఎన్నికల్లో పోగొట్టుకున్న దాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే… ఇప్పట్నుంచే అలర్ట్‌ అవక తప్పదన్నది బీఆర్‌స్‌ వాయిస్‌. స్థానిక కార్మికవర్గాల్లో పట్టు సాధించడం.. సింగరేణి పరిధిలోని నియోజకవర్గాల్లో పార్టీని మళ్లీ బలోపేతం చేయడం గులాబీ ప్లాన్‌లోని ముఖ్యాంశాలు. సింగరేణి ఏరియాలో రాజకీయాలు చేయాలంటే అక్కడి కార్మికుల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ముందుకు వెళ్ళడం ముఖ్యం. ఇప్పుడు బీఆర్ఎస్‌ కూడా అదే పని చేయాలని అనుకుంటోందట. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా, పెండింగ్ బకాయిలు, మెడికల్ బోర్డుల నిర్వహణ, డిపెండెంట్ ఉద్యోగాలు, కార్మిక సంఘాల ఎన్నికలు.. ఇలా రకరకాల అంశాలను తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. వీటిపై ఉద్యమించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి చాలా మంచి చేశామని ఓవైపు చెబుతూ…మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదన్న పాయింట్‌ని హైలైట్‌ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. కోల్‌బెల్ట్‌లో ప్రస్తుతం ఒక్క స్థానానికే పరిమితమైన బీఆర్ఎస్…. వచ్చే ఎన్నికల నాటికి తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలంటే నియోజకవర్గాల వారీగా పార్టీ పునర్నిర్మాణం అవసరం భావిస్తోందట. అందులో భాగంగా స్థానిక నాయకులను క్రియాశీలకం చేయడం, కార్మిక సంఘాలతో సమన్వయం, పార్టీ క్యాడర్‌ను క్షేత్రస్థాయికి పంపడం లాంటి పనుల మీద స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నారట. అందుకోసం ఈనెల 14న రామగుండంలో నిర్వహించబోయే సింగరేణి కార్మిక గర్జనను వేదికగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. సభ తర్వాత కూడా ఇదే వేగంతో నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు చేస్తామని చెబుతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. దీంతో… తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి గులాబీ వర్గాలు.