Reading Time: 2 minutes
Amit Shah Targets Rahul Gandhi Says Congress Must Prepare For 2029 Defeat

Amit Shah: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. 2029లో రాహుల్ గాంధీ ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడూ ఈవీఎంలే తమ ఓటమికి కారణమని చెబుతున్నాయని, గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌లో జరిగిన కాంగ్రెస్ గెలవలేదని అన్నారు. దీని ద్వారా కాంగ్రెస్ చెబుతున్నవి అన్నీ అబద్ధాలే అని తేలిందని అమిత్ షా అన్నారు. త్రిపుర, బెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో దశాబ్ధాలుగా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని అమిత్ షా గుర్తు చేశారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని తప్పుబడుతూ.. ‘SIR’ అనేది 2024 తర్వాతే అమలులోకి వచ్చిందని, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాన నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగినప్పటి నుంచే ఆ పార్టీ వరస ఎన్నికల్లో ఓడిపోతుందని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, ఇది రాహుల్ గాంధీకి ఒక పాఠం లాంటిదని అన్నారు. రాజస్థాన్‌లో 85 శాతం వార్డుల్లో ఆప్ తన డిపాజిట్ కోల్పోయిందని అన్నారు. త్రిపుర గ్రామ కమిటీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.

ఎన్నికల్లో బీజేపీ గెలుపు, మోడీ ప్రజాదరణను రాహుల్ గాంధీ ఎస్ఐఆర్‌ అక్రమాలుగా పొరబడుతున్నారని, ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని హితవు పలికారు. ఇటీవల పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేదని అన్నారు. కాంగ్రెస్ స్థానమైన అస్సాంలోని నౌగావ్‌‌లో బీజేపీ గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. గుజరాత్‌లో చివరిసారిగా కాంగ్రెస్ 41 ఏళ్ల క్రితం గెలిచిందని, ఇది రాహుల్ గాంధీ తెలుసుకోవాలని అన్నారు.