Reading Time: < 1 minute
Shikhar Dhawan Legal Action World T20 Continent Cup Name Misuse

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్’ టోర్నమెంట్‌లో తన అనుమతి లేకుండానే తన పేరును పాల్గొనే జాబితాలో చేర్చడంపై ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ధావన్ స్పందిస్తూ.. టోర్నమెంట్‌లో తాను భాగం కానని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేదా అనుమతి లేకుండా తన పేరును దుర్వినియోగం చేశారని, దీనిపై తన లీగల్ టీమ్ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అభిమానులు, మీడియా ఈ అనధికారిక ప్రకటనలను నమ్మవద్దని, ఎలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ టోర్నమెంట్‌లో ఆసియా వారియర్స్ జట్టు తరఫున ధావన్ ఆడనున్నట్లు వార్తలు వచ్చాయి. విశేషం ఏమిటంటే.. ఈ జట్టులో పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు పలువురు మాజీ భారత క్రికెటర్ల పేర్లు కూడా ఉన్నాయి. రాహుల్ శర్మ, గుర్‌కీరత్ సింగ్ మాన్, అభిమన్యు మిథున్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే పాకిస్థాన్ తరఫున సొహైల్ తన్వీర్, ఇఫ్తికార్ అహ్మద్ వంటి ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ టోర్నమెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ధావన్ పూర్తిగా తేల్చిచెప్పారు.

గతంలో దేశం పట్ల, ఉగ్రవాద ఘటనల పట్ల శిఖర్ ధావన్ తన దేశభక్తిని చాటుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు లేదా టోర్నమెంట్ల విషయంలో ఆయన ఎప్పుడూ కఠినంగానే వ్యవహరించారు. ఇప్పుడు తన పేరును పాకిస్థాన్ ఆటగాళ్లు ఉన్న జట్టులో ప్రస్తావించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనధికారికంగా పేర్లు వాడుకోవడంపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేయడంతో నిర్వాహకులు ఇరుకున పడ్డారు.