Reading Time: 2 minutes
Jasprit Bumrah: క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?.. రోహిత్ శర్మ లీక్ చేశాడుగా

Jasprit Bumrah: భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బుమ్రా గురించి టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. ఒకవేళ బుమ్రా కనుక క్రికెటర్ కాకపోయి ఉంటే కచ్చితంగా డాక్టర్ అయ్యేవాడని హిట్ మ్యాన్ పేర్కొన్నారు. దీనికి ఆయన చెప్పిన సరదా కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రోహిత్ శర్మ స్వయంగా హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ షోలో ఈ సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ కృష్ణ అభిషేక్ అతిథిగా హాజరై పలు ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా ఒకవేళ బుమ్రా క్రికెటర్ కాకపోతే ఏమయ్యేవాడని ప్రశ్నించగా.. రోహిత్ శర్మ వెంటనే స్పందిస్తూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. బుమ్రా కచ్చితంగా డాక్టర్ అయి ఉండేవాడని, ఎందుకంటే అతను మ్యాచ్ చివరి దశలో అంటే డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ చేసి జట్టును ఓటమి నుంచి కాపాడుతాడని చెప్పారు. డాక్టర్లు కూడా మరణం నుంచి ప్రాణాలు కాపాడుతారని, బుమ్రా కూడా డెత్ ఓవర్లలో అలాగే కాపాడతాడని ఫన్నీగా వివరించారు.

ఇదే షోలో భారత మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి కూడా రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువీ కనుక క్రికెటర్ కాకపోతే కచ్చితంగా స్కూల్ హెడ్‌మాస్టర్ అయ్యేవాడని సరదాగా నవ్వించారు. తాము 2006-2007 కాలంలో కొత్తగా జట్టులోకి వచ్చినప్పుడు యువరాజ్ సింగ్ తమకు బాగా తిట్లు, సలహాలు ఇచ్చేవాడని గుర్తుచేసుకున్నారు. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందరినీ ప్రేమగా చూసుకుంటూనే, కొత్త ఆటగాళ్లలో భయాన్ని పోగొట్టి ధైర్యం నూరిపోసేవాడని రోహిత్ కొనియాడారు.

ప్రస్తుతం రోహిత్ శర్మ కేవలం వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఆయన, పూర్తిగా 2027 వన్డే వరల్డ్ కప్‌పైనే తన పూర్తి దృష్టిని పెట్టారు. ఇదే తన చివరి టోర్నమెంట్ కావచ్చని భావిస్తున్న ఆయన, తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బరువు తగ్గారు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోహిత్, ఆడిన గత నాలుగు మ్యాచ్‌లలో రెండు శతకాలు సాధించి తన జోరును కొనసాగిస్తున్నారు.

మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటారో, బయట అంత సరదాగా ఉండే రోహిత్ శర్మ ఈ షో ద్వారా క్రికెటర్ల గురించి చెప్పిన విషయాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బుమ్రా, యువరాజ్ సింగ్‌లపై ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..