Reading Time: < 1 minute
Sahibzada Farhan Breaks Abhishek Sharma Record Equals Virat Kohli

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో గెలుచుకోగా, తొలిసారి పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన ఫర్హాన్ అరుదైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు మ్యాచ్‌లలోనూ అర్ధశతకాలు బాది మొత్తం 238 పరుగులు సాధించాడు.

ఈ ప్రదర్శనతో గతంలో భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు మీద ఉన్న రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు. గత నెలలో ఢిల్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో అభిషేక్ శర్మ మూడు మ్యాచ్‌లలో కలిపి 229 పరుగులు చేయగా, ఇప్పుడు ఆ రికార్డును ఫర్హాన్ అధిగమించాడు. ఈ జాబితాలో కొలిన్ మున్రో 223 పరుగులతో మూడో స్థానంలో, డేవిడ్ వార్నర్ 217 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు.

అలాగే.. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలోనూ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలోని ఎనిమిదవ బ్యాటర్‌గా ఫర్హాన్ నిలిచాడు. పాకిస్థాన్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఈ రికార్డును తొలిసారి నమోదు చేశాడు. కోహ్లీ సరసన నిలిచిన ఫర్హాన్, పాకిస్థాన్ క్రికెట్‌లో తన సత్తాను చాటుకున్నాడు.