
Pawan Kalyan: మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమై.. తనదైన స్టైల్, మేనరిజంతో ‘పవర్ స్టార్’గా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 30 ఏళ్లు పూర్తయింది. మాస్ ఫాలోయింగ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ జర్నీ తెలుగు సినిమా చరిత్రలోనే ప్రత్యేకమని చెప్పవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 1996 అక్టోబర్ 11న ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కళ్యాణ్ బాబు.. అనతికాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు. ‘తొలిప్రేమ’, ‘బద్రి’, ‘ఖుషి’ వంటి వరుస చిత్రాలతో యువతకు తిరుగులేని ఐకాన్‌గా మారారు. పవర్ ఫుల్ యాక్షన్‌తో పాటు డైలాగ్ డెలివరీలో పవన్ చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కేవలం నటుడిగానే కాకుండా.. ఆయన వేసుకునే దుస్తులు, వాడే బైక్.. ఇలా ప్రతి అంశం సరికొత్త ట్రెండ్‌గా మారి ‘పవనిజం’ అనే కొత్త విధానానికి ప్రాణం పోశాయి.
గడచిన 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందుకోవడంతో పాటు కొన్ని పరాజయాలనూ ఎదుర్కొన్నారు. అయితే ఫలితాలతో సంబంధం లేకుండా.. ఆయన క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే వచ్చింది. ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి పరిశ్రమ హిట్లు బాక్సాఫీస్ వద్ద ఆయన స్టామిన ఏంటో నిరూపించాయి. ఒకానొక దశలో పవన్ సినిమా విడుదలవుతుందంటే చాలు.. కంటెంట్‌తో నిమిత్తం లేకుండా థియేటర్లు దద్దరిల్లే స్థాయికి ఆయన క్రేజ్ ఉండేది. కేవలం నటుడిగానే కాకుండా ‘జానీ’ చిత్రంతో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విభాగాల్లోనూ తనదైన మార్క్ చూపించారు.
సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సమయంలోనే ప్రజాసేవ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒకవైపు రాజకీయ బాధ్యతల్లో నిమగ్నమై ఉంటూనే.. మరోవైపు ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించాడు. ఒక సాధారణ నటుడిగా ప్రయాణం ప్రారంభించి, కోట్ల మందికి ఆరాధ్యుడిగా, పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ భవిష్యత్తులోనూ సినిమాలు, ప్రజాసేవ రెండింటినీ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.