
- కౌకూరు విల్లా ఆర్కిడ్స్‌లో సెక్యూరిటీ గార్డు దారుణం
- నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య
- కాళ్లు, చేతులు బంధించి ఇటుకలు,
- రాళ్లు కట్టి సంపులో పడేసిన విక్రమ్
- ‘డబ్బులు అరేంజ్ అయ్యాయా?’ అని మళ్లీ ఫోన్
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ/పద్మారావు నగర్, వెలుగు: మేడ్చల్ జిల్లా బొల్లారంలోని కౌకూరు జనప్రియ ఆర్కాడియా(విల్లా ఆర్కిడ్స్)లో శనివారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైన ఐదేళ్ల చిన్నారి మోజెస్ అరులియా ఫెర్నాండెజ్(మోను) దారుణ హత్యకు గురైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ గారాల పట్టి క్షేమంగా తిరిగి వస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు తీరని శోకమే మిగిలింది. గేటెడ్ కమ్యూనిటీలో కొన్నాళ్ల క్రితం విధుల నుంచి తొలగించిన బిహార్‌కు చెందిన విక్రమ్ అనే సెక్యూరిటీ గార్డే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.
అభం శుభం తెలియని పసిపాప ప్రాణాలను కిరాతకంగా తీసిన ఈ ఘటనతో విల్లా పరిసరాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారి మోను తల్లిదండ్రులు అగ్రికల్చర్ సైంటిస్ట్ మిల్టన్, డేసీ దంపతులు జనప్రియ ఆర్కాడియాలోని విల్లా నెంబర్ 84లో నివాసం ఉంటున్నారు. అయితే, సెక్యూరిటీ గార్డు విక్రమ్ సరిగ్గా ప్రవర్తించడం లేదన్న కారణంతో అతడిని విల్లా అసోసియేషన్ కమిటీ వారం రోజుల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ కమిటీలో చిన్నారి మోను తాత కూడా కీలక సభ్యుడు కావడంతో, ఉద్యోగం పోయిందన్న కసితో వారిపై విక్రమ్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని దెబ్బతీసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని పథకం వేశాడు.
ఈ క్రమంలో చిన్నారి అరులియా శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో విల్లా ఆవరణలో సైకిల్ తొక్కుతూ తోటి పిల్లలతో ఆడుకుంటోంది. చిన్నారిని మాటల్లో పెట్టిన విక్రమ్.. చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి క్లబ్‌హౌస్ సెల్లార్ వైపు తీసుకెళ్లాడు. పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కాలనీ మొత్తం వెతికి వెంటనే బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నిందితుడు 8 గంటలకే తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైనా.. పాపను బయటకు తీసుకెళ్లేందుకు వీలు కాకపోవడంతో దారుణానికి ఒడిగట్టినట్లు చెప్తున్నారు.
చంపేశాక కూడా.. డబ్బుల కోసం ఫోన్
చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మల్కాజిగిరి పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలతో డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ల సాయంతో ముమ్మర గాలింపు చేపట్టారు. కాలనీ ఎంట్రన్స్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా చిన్నారి బయటకు వెళ్లలేదని, వాచ్‌మెన్ విక్రమ్ ఒక్కడే అనుమానాస్పదంగా పారిపోతున్నట్లు స్పష్టమైంది. విక్రమ్ ఫోన్ లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో చూపించి స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులు లాడ్జీలు, హోటళ్లను జల్లెడ పట్టారు. మరోవైపు విల్లా క్లబ్‌హౌస్ సమీపంలో చిన్నారి సైకిల్ పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే సెల్లార్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అక్కడ ఉన్న నీటి సంపులో చూడగా కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి పడేసిన చిన్నారి మృతదేహం కనిపించింది. చిన్నారిని బయటకు తీసుకెళ్లడం వీలుకాకపోవడంతో సెల్లార్‌లోనే బంధించిన నిందితుడు, డ్యూటీలో ఉన్న మరో గార్డు ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు కాల్ చేసి పాపను వదిలేయాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా గుర్తించారు. తల్లిదండ్రులు ఆ డబ్బు ఇచ్చేందుకు సిద్ధపడినప్పటికీ, అప్పటికే పోలీసులకు ఫిర్యాదు వెళ్లిందన్న భయంతో పసిపాప మెడకు నైలాన్ తాడు బిగించి ఉరేసి చంపి.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి రాళ్లు, ఇటుకలు కట్టి డెడ్ బాడీ నీళ్లపై తేలకుండా సంపులో పడేశాడు. ఇంత చేసినా.. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు పాప తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘డబ్బులు అరేంజ్ అయ్యాయా?’ అంటూ నిందితుడు ఆరా తీశాడు.
ఒక్కడేనా.. ఇంకా ఎవరైనా ఉన్నారా?
చిన్నారి కిడ్నాప్, హత్య ఘటనలో మరో ఇద్దరు ముగ్గురు సహకారం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో సెక్యూరిటీ గార్డు ఫోన్ ఇవ్వడం, ఇద్దరు మహిళలు కూడా హెల్ప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు విక్రమ్‌ది బిహార్‌కు చెందిన వ్యక్తి కాగా.. అతడికి సహకరించింది ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా, చిన్నారి మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు చిన్నారి డెడ్‌బాడీని అప్పగించారు. కాగా, ఎంత డబ్బైనా ఇస్తాం, పాపను ఏమీ చేయవద్దని వేడుకున్నామని చిన్నారి మోను తాతయ్య అరుల్ దాస్ మీడియాకు వెల్లడించారు. రెండు రోజుల క్రితమే విధుల్లోంచి తొలగించిన వాచ్‌మెన్ విక్రమ్‌తో తమకు పెద్దగా పరిచయం కూడా లేదన్నారు. పాపను చంపేసిన అనంతరం ఏమీ తెలియనట్లు అందరి మధ్యలో నుంచే వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ ఫోన్ చేసి ‘పాప అంటే ప్రేమ లేదా? డబ్బులు ఎందుకు పంపించలేదు?’ అంటూ దౌర్జన్యంగా మాట్లాడాడని కన్నీటిపర్యంతం అయ్యారు. తమకు వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదని, నేరస్తుడికి ఉరిశిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.