
కలియుగ వైకుంఠం తిరుమల సరికొత్త శోభను సంతరించుకుంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా విద్యుత్ దీపాల వెలుగులు.. కనువిందు చేస్తున్న పుష్పాలంకరణలు.. ఆకట్టుకుంటున్న దేవతామూర్తుల సెట్టింగులతో శేషాచలం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
అక్టోబర్ 20వ తేదీ వరకు జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు, ఐదు లక్షల కట్ ఫ్లవర్లతో తిరుమలను అలంకరించేందుకు ఏర్పాట్లు చేసింది.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ఏడుకొండలు సరికొత్త అందాలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి ఆలయం, నాలుగు మాడవీధులు, ప్రధాన కూడళ్లు, రహదారులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. తిరుమల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన దేవతామూర్తుల భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పుష్పాలంకరణలు చేపడుతున్నారు. ఇందుకోసం 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు, ఐదు లక్షల కట్ ఫ్లవర్లను వినియోగిస్తున్నారు. శ్రీవారి వాహన సేవల విశిష్టతను తెలియజేసేలా రూపొందించిన పుష్పాలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.
మరోవైపు బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 16న గరుడ వాహన సేవ, 17న పుష్పక విమానం, 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు…
విద్యుత్ కాంతులు.. పూల పరిమళాలు.. గోవింద నామస్మరణలతో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ఏడుకొండలు భూలోక వైకుంఠాన్ని తలపిస్తున్నాయి