
టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కుతున్న రూరల్ డ్రామాలు ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కోవలోనే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సమర్పణలో తెరకెక్కుతున్న సరికొత్త రస్టిక్ రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. కిరణ్ జయ్ కుమార్ రచన, దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై తాజాగా విడుదలైన ‘కాషన్ 1’ వీడియో గ్లింప్స్‌తో అంచనాలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. రాయలసీమలోని ప్రసిద్ధ ప్రాంతమైన జొన్నగిరి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతోంది. సాధారణంగా రాయలసీమలో వర్షాలు పడినప్పుడు పొలాల్లో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం జోరుగా సాగుతుంటుంది. ఈ ఆసక్తికరమైన పాయింట్‌ను ప్రధానాంశంగా మలుచుకుని, ఒక రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీకి కామెడీ టచ్ ఇస్తూ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక ‘కాషన్ 1’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ప్రారంభంలోనే “గమనిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి” అనే క్యాప్షన్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. వర్షం కురిసిన తర్వాత పొలంలో హీరో హీరోయిన్‌తో పాటు కొందరు వజ్రాల కోసం వెతుకుతుండగా, హీరోయిన్‌కు ఒక రాయి దొరుకుతుంది. ఆమెను ఇష్టపడే హీరో ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఆమె చెప్పే ఒక ఊహించని బూతు సమాధానం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. ఆ దెబ్బకు హీరోతో పాటు పక్కనే ఉన్న ఫ్రెండ్ కూడా దిమ్మతిరిగిపోతారు. అయితే ఆ షాక్‌నుంచి తేరుకున్న హీరో దానిని వెంటనే “మోటు సరసం” అంటూ కవర్ చేసే తీరు నవ్వులు పూయిస్తోంది.
విజయ్ కృష్ణ లింగమనేని ‘విజయం’ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తుండగా, మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. కృష్ణ కమల్, మాహి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, ఫణీంద్ర దేవరపల్లి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవలం ఒకే ఒక్క గ్లింప్స్‌తో యూత్‌లో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ‘జో జో’.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!