
మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన చిరువ్యాపారులు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్లో మంగళవారం జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. ఆకస్మికంగా కూల్చివేతలు చేపట్టడంతో చిరువ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కేయూ ఎస్డీఎల్సీఈ జంక్షన్ నుంచి కరీంనగర్ వైపు భీమారం మార్గంలో కొన్ని నెలలుగా పలువురు చిరువ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు.
పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ కోర్టుల నిర్వాహకులు సైతం ఫుట్పాత్లపై షెడ్లు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆక్రమణలను తొలగించినా, తిరిగి షెడ్లు వెలిశాయి. ప్రస్తుతం ఈ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించనున్న నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఆక్రమణలను జేసీబీలతో తొలగించారు.
తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామునే వచ్చి షాపులు, డబ్బాలను కూల్చివేశారని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతలతో వేలాది రూపాయల విలువైన సామగ్రి, పండ్లు పనికిరాకుండా పోయాయని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.