
Jim Jim Taara Song: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పాట ట్రెండ్ అవుతుందో, ఏ క్షణంలో ఏ విదేశీ వేదికపై మన తెలుగు జానపదం మారుమోగుతుందో చెప్పలేం. సరిగ్గా అలాంటి అద్భుతమే ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. “జిమ్ జిమ్ తార” అనే ఒక పాపులర్ తెలుగు ఫోక్ సాంగ్ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటి సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల ఈ పాటను రాయలసీమ (కర్నూలు) ప్రాంతానికి చెందిన గోకుల లక్ష్మీదేవి (సోషల్ మీడియాలో లక్ష్మీ ఆంటీగా ప్రసిద్ధి) పాడారు. ఇక, డీజే రీమిక్స్ వెర్షన్‌గా వచ్చిన లక్ష్మీదేవి పాడిన ఈ జానపద గీతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో యువతను ఉర్రూతలూగిస్తోంది. విద్యార్థుల నుంచి సోషల్ మీడియా క్రియేటర్ల వరకు అందరూ తమ అద్భుతమైన డాన్స్ స్టెప్స్, క్రియేటివ్ ట్రాన్సిషన్ వీడియోలతో ఈ పాటకు ప్రాణం పోశారు. దీంతో ఈ సాంగ్ తెలుగు రాష్ట్రాల పరిధులను దాటి దేశవ్యాప్తంగా తెగ వైరల్ అయింది. అయితే ఈ ట్రెండ్‌ను ఎవరూ ఊహించని విధంగా ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది అమెరికన్ ఫుట్‌బాల్ క్లబ్ ఇంటర్ మయామి. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మేజర్ లీగ్ సాకర్ క్లబ్, తమ ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోకు ఈ తెలుగు పాటను బ్యాక్‌గ్రౌండ్‌గా జోడించింది. ఏకంగా 19 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న “intermiamicf” అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో ఈ వీడియో ప్రత్యక్షం కావడంతో తెలుగు నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
ఈ ప్రాక్టీస్ సెషన్‌లో సాక్షాత్తు లియోనెల్ మెస్సీ మైదానంలో కనిపించడం, ఆయన ప్రాక్టీస్‌కు మన తెలుగు “జిమ్ జిమ్ తార” డీజే బీట్ సింక్ అవ్వడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్షణాల్లో లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ రీల్ కింద మన తెలుగు యువత పెడుతున్న కామెంట్స్ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. “జిమ్ జిమ్ తార” అంటే కేవలం లోకల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అంటూ నెటిజన్లు పెడుతున్న క్రేజీ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక, క్లబ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ మయామి అనబడే ఈ అమెరికన్ సాకర్ క్లబ్‌లో మెస్సీ చేరిన తర్వాతే దీనికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా మెస్సీ కెప్టెన్సీలో ఈ జట్టు తమ మొట్టమొదటి ఎమ్ఎల్‌ఎస్ కప్‌ను సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. అలాంటి ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ క్లబ్ అధికారిక పేజీలో మన తెలుగు జానపద పాట వినిపించడం సంచలనంగా మారింది. ఒక సాధారణ పల్లెటూరి జానపద గీతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా శక్తితో ఎంతటి గ్లోబల్ రీచ్‌ను సాధించగలదో ఈ ఘటనే నిదర్శనం.