
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలతో భేటీకి అనుమతి నిరాకరించడంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ క్లారిటీ ఇచ్చారు. సోమవారం (అక్టోబర్ 12) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో అవకతవకలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా వినతిపత్రం సమర్పించేందుకు సోమవారం (అక్టోబర్ 12) సాయంత్రం అపాయింట్మెంట్ ఇవ్వాలని ఇండియా కూటమి నేతలు కోరారు. కానీ వారి అభ్యర్థనను తాను తిరస్కరించాను. ఇండియా కూటమి నేతలు లేవనెత్తిన అంశాలు ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్నాయి.
ఈ సమయంలో వారితో వ్యక్తిగతంగా భేటీ కావడం కరెక్ట్ కాదు. ఏవైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చు. సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ అందరికీ తెరిచే ఉంటాయి. ప్రతి భారత పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉంది. మేం వారి సమస్యలను విని చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సహాయాన్ని అందిస్తాం. ఇండియా కూటమి నేతలు నిరసనలు కాకుండా మంగళవారం (అక్టోబర్ 13) కొత్త పిటిషన్‌తో వస్తే కోర్టు దానిని పరిశీలిస్తుంది’’ అని సీజేఐ స్పష్టం చేశారు. సీజేఐ అపాయింట్మెంట్ నిరాకరించినప్పటికీ సోమవారం (అక్టోబర్ 12) సుప్రీం కోర్ట్ మార్చ్ కార్యక్రమం కొనసాగుతోందని ఇండియా కూటమి స్పష్టం చేసింది.
సుప్రీం కోర్ట్ వైపు ఇండీ కూటమి మార్చ్
దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం సోమవారం (అక్టోబర్ 12) సుప్రీంకోర్టు వైపు భారీ శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇందులో భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన ఆదివారం ‘ఎక్స్’ వేదికగా విద్యార్థులు, పౌర సమాజ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు.
‘‘ అక్టోబర్ 12న యావత్ భారతదేశం శాంతియుతంగా, ఏకతాటిపై నిలిచి సుప్రీంకోర్టు వైపు అడుగులు వేయనుంది. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులు, పౌర సమాజ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మాతో చేతులు కలపాలి” అని రాహుల్ గాంధీ కోరారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నట్టు ప్రకటించారు.
ఈ మార్చ్ మధ్యాహ్నం 1:30 గంటలకు దేశ రాజధానిలోని కన్నాట్ ప్లేస్ వద్ద ప్రారంభమై, బారకంబా రోడ్ మీదుగా సుప్రీంకోర్టు వరకు కొనసాగుతుందని తెలిపారు. ‘చలో ఢిల్లీ’..‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ పేరిట చేపట్టే ఈ ఉద్యమంలో రాజకీయాలకతీతంగా ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న పౌరులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
దేశ గళాన్ని ఎవరూ నొక్కలేరు..
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఇటీవల యువత శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడి జరిగిందని ఆరోపించారు. ‘‘ఇది మనం కోరుకుంటున్న భారత్ కాదు. ఈ మార్చ్ ఏ ఒక్క పార్టీకో, కులానికో, వర్గానికో పరిమితం కాదు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి భారతీయుడి కోసం” అని వ్యాఖ్యానించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, దేశం కోసం కలిసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రదర్శన అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి వినతిపత్రం అందజేయనున్నట్టు రాహుల్‌గాంధీ వెల్లడించారు. ఓట్ల దొంగతనం వెంటనే ఆగాలని, ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని, ఈవీఎంల వాడకాన్ని నిలిపివేయడంతోపాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనేవే తమ డిమాండ్లని వెల్లడించారు. సీజేఐ అపాయింట్మెంట్ నిరాకరించినప్పటికీ సుప్రీం కోర్ట్ మార్చ్ కార్యక్రమం కొనసాగుతోందని ఇండియా కూటమి స్పష్టం చేసింది.