
- 118 పోస్టుల భర్తీకి గత డిసెంబర్14న రాత పరీక్షలు
- వెబ్‌సైట్‌లో ఫలితాలు, ఈ నెల17న సర్టిఫికెట్ల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. కోర్టులో కేసుల ఇతర కారణాల వల్ల పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) సోమవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి టీఎస్ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకుగాను 2025 ఆగస్టు15న నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది డిసెంబరు14న రెండు పేపర్లుగా పరీక్షలు నిర్వహించారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈ నెల17న సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు.
వెబ్‌సైట్‌లో కాల్ లెటర్
బోర్డు వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్ (ఇంటిమేషన్ లెటర్) డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇంటిమేషన్ లెటర్‌లోనే ధ్రువపత్రాల పరిశీలన జరిగే ప్రాంతం, సమయం వివరాలను పొందుపరిచినట్టు తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో స్వయంగా హాజరుకావాల్సి ఉంటుందని తెలియజేశారు.
అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటవుట్, రాత పరీక్ష ఫలితాల షీట్, వెరిఫికేషన్ ఇంటిమేషన్ లెటర్, గుర్తింపు కార్డులతో పాటు పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
విద్యార్హతలకు సంబంధించి డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, బీఎల్ సర్టిఫికెట్లు, బార్ కౌన్సిల్ ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికెట్ పత్రాలను సమర్పించాలని చెప్పారు. క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేండ్ల న్యాయవాద అనుభవం ఉన్నట్టు సంబంధిత బార్ అసోసియేషన్ లేదా కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ జారీ చేసిన అనుభవ ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని కోరారు.
స్థానికత, రిజర్వేషన్ల కోసం స్టడీ సర్టిఫికెట్లు తప్పనిసరి
స్థానికత కోసం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ (ఎంఆర్‌ఓ జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం)చూపించాల్సి ఉంటుందని వెల్లడించారు. రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపు పొందే అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా కుల ధ్రువీకరణ పత్రాలను మాత్రమే సమర్పించాలని వివరించారు.
ఎస్సీ అభ్యర్థులు వర్గీకరణ తెలిపే గ్రూప్–-I, II లేదా III సర్టిఫికెట్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2025, ఏప్రిల్ 1 తర్వాత పొందిన తాజా సర్టిఫికెట్లను జారీ చేయాలని స్పష్టం చేశారు. సాంకేతిక లేదా ఇతర సమస్యలు ఎదురైనా అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ద్వారా support@tslprb.in కు మెయిల్, 040-41895151 హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించవచ్చని సూచించారు.