
ఆయన.. ఐఏఎస్ అధికారి. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన తన హోదా, స్థాయి మరచి పబ్‌లో వీరంగం చేశారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా వారిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయనే.. కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (కడ) ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్. వికాస్ మర్మత్‌పై బెంగళూరు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని కావోర్ బార్ అండ్ రెస్టారెంట్‌లోని పబ్‌లో శనివారం తెల్లవారుజామున బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో బార్‌లోని కస్టమర్ల వయసును ధ్రువీకరించేందుకు గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న నలుగురు పోలీసులతో వాగ్వాదానికి దిగి, దాడి చేశారు. దాడి చేసినవారిలో ఐఏఎస్ అధికారి వికాస్ కూడా ఉన్నట్టు ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే కబ్బన్ పార్కు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్కు పోలీసులు ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌తో పాటు అభయ్ ఉదయ్ సింగ్, నితీశ్, రోషన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.