
- రిజర్వాయర్లలో నీళ్లు లేవు.. గ్రౌండ్‌వాటర్ పడిపోతున్నయ్
- నీటి లభ్యత ప్రకారం పంటల ప్రణాళిక రూపొందించాలి
- ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
- కరువుపైనా రాజకీయాలా? అని ప్రతిపక్షాలపై ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోతుండటం, భూగర్భజలాలు అడుగంటుతుండటంతో తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. నీటి లభ్యతను అంచనా వేసి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పంటల ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి జిల్లా కలెక్టర్లు, రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, దీనివల్ల వర్షాలు తగ్గడం, నీటి వనరుల్లో నిల్వలు పడిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించి, పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని సూచించారు.
వరితో నీటి ఎద్దడి ముప్పు
యాసంగిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు చేస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని తుమ్మల హెచ్చరించారు. అందుకే శనగ, పెసర, మినుము, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. నేల స్వభావం, ప్రాంతీయ వాతావరణం, అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాతో పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులను కోరారు. ఎల్‌నినో ప్రభావం, నీటి వనరుల పరిస్థితిపై వాస్తవాలను రైతులకు తెలియజేయడం అధికారుల బాధ్యతని మంత్రి స్పష్టం చేశారు. ఐఎండీ, నీటిపారుదల, భూగర్భజల, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వలు, భూగర్భజలాల స్థాయి, విద్యుత్ సరఫరా, వర్షాల అంచనాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పంటల ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడాలని, రైతువేదికలను వ్యవసాయ సలహా కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం పప్పుధాన్యాలు, నూనెగింజల విత్తనాలను సబ్సిడీపై అందిస్తోందని తుమ్మల వెల్లడించారు. ఆరుతడి పంటల సాగుతోపాటు వాటి మార్కెటింగ్, కొనుగోలు అవకాశాలను మెరుగుపరిచేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా పంటలు ఎంచుకునేలా రైతులకు మార్గనిర్దేశం చేసి, వారు నష్టపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
కరువుపైనా రాజకీయాలా?
వర్షాభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నాయని తుమ్మల విమర్శించారు. రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని, వారిలో అనవసర ఆందోళన కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సంజయ్ జాజు, అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అగ్రికల్చర్, హార్టికల్చర్ వర్సిటీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతువేదికల నుంచి వేలాది మంది రైతులు ఈ సదస్సులో భాగస్వాములయ్యారు.