
Farmer Relief: మహారాష్ట్రలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతన్నలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందే వరకు వేచి చూడకుండా.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి రైతుకు రూ. 5,000 చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని నేరుగా దీపావళి పండుగ కంటే ముందే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 36 జిల్లాల్లోని సుమారు 34 జిల్లాల పరిధిలోని 305 తాలూకాలను ప్రభుత్వం ఇప్పటికే కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఇది దాదాపు రాష్ట్ర మొత్తం భూభాగంలో 75 శాతం కావడం గమనార్హం. మరాఠ్వాడా, విదర్భ, ఉత్తర మహారాష్ట్ర, పూణె సహా అన్ని రెవెన్యూ డివిజన్లలో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.
ముఖ్యంగా సోలాపూర్ జిల్లాలో సాధారణ వర్షపాతంలో సగం కన్నా తక్కువగా కేవలం 48 శాతమే వర్షం కురవడంతో అక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు మరిన్ని ఉపశమన చర్యలను కూడా చేపట్టింది. పంట రుణాల వసూళ్లపై తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేయడం, కరెంటు బిల్లులలో రాయితీలు కల్పించడం, తాగుసాగు నీటి వసతిని మెరుగుపరచడం, విద్యార్థుల పాఠశాల ఫీజుల మాఫీ వంటి చర్యలు అమలు చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలోనే స్వయంగా కరువు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి, రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారమే ఈ తక్షణ సాయాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.