Reading Time: 2 minutes
Mary Millben Alleges Cjp Gets Us Funding From Select Donors

Mary Millben: ఢిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల నేపథ్యంలో ప్రముఖ అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్ సంచలన ఆరోపణలు చేశారు. సీజేపీకి అమెరికా నుంచి ‘‘ఎంపిక చేసిన దాతలు’’ నిధులు సమకూర్చుకుతున్నారని ఆమె ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆమె ప్రధాన నరేంద్రమోడీకి మద్దతుగా, సీజేపీకి వ్యతిరేకంగా పోస్ట్ చేశారు.

ఎన్నికల జాబితాలో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియ ద్వారా కోట్ల సంఖ్యలో ఓటర్లను తొలగిస్తున్నారని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌‌ను తొలగించాలని కోరుతూ సీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ నిరసనల వెనక విదేశీ శక్తుల కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.

ఎక్స్‌లో పోస్ట్ మేరీ మిల్‌బెన్.. ‘‘ సంప్రదాయవాద ప్రపంచ నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ఆ దేశానికి చెందిన అమెరికాలో చదువుకున్న వ్యక్తిని గుర్తించడం, అతడిని తీవ్రవాద ధోరణుల వైపు మళ్లించడం, తిరిగి స్వదేశానికి పంపించి గందరగోళం, విధ్వంసం సృష్టించేందుకు నిధులు సమకూర్చడం’’ ఈ విధానంలో భాగమని ఆమె ఆరోపించారు. అమెరికాకు చెందిన దాతలు ఈ కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తున్నారని అన్నారు. అయితే, ఇలాంటి చాలా ప్రయత్నాలు విఫలయమ్యాయని, అయినప్పటికీ ఆయా దేశాల అభివృద్ధి, పాలనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆమె అన్నారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పేరు నేరుగా తీసుకోకుండా పరోక్షంగా ఆమె వ్యాఖ్యానించారు. దీప్కే అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నట్లు చెప్పుకుంటున్నాడు. బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు సంపాదించాడు. ఇదే సమయంలో మేరీ మిల్‌బెన్ ప్రధాని నరేంద్రమోడీకి మద్దతు ప్రకటించారు. భారతదేశ పాలనను దెబ్బతీసేందుకు విదేశీ శక్తులు చేసే ప్రయత్నాలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మౌనంగా ఉండాల్సిన సమయం కాదని, యువత దేశ ప్రయోజనాల కోసం ముందుకు రావాలని కోరారు.