
AIతో వస్తున్న మార్పులతో భారత టాప్ ఐటీ దిగ్గజ సంస్థలు ప్రస్తుతం బిజినెస్ చేస్తున్న విధానంలో దేశ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించలేకపోవచ్చని డెలాయిట్ యూఎస్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ టండన్ అన్నారు. సాంప్రదాయ ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఇప్పటివరకు తక్కువ ఖర్చుతో సేవలు అందించడంపైనే పోటీపడ్డాయని.. కానీ ఏఐ రంగంలో కొత్త ఆవిష్కరణలే కీలకమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి పాత దిగ్గజాలు కాకుండా.. ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ లాంటి కొత్త సంస్థలే ఏఐ విప్లవానికి నాంది పలికాయని గుర్తుచేశారు. పాత పద్ధతులకే పరిమితం కాకుండా, కొత్త ఆలోచనలతో వచ్చే స్టార్టప్లు, సంస్థలే ఈ భవిష్యత్ తరహా మార్పునకు ఆజ్యం పోస్తాయని టండన్ అభిప్రాయపడ్డారు.
అమెరికాలోని టాప్ ఏఐ కంపెనీలు భద్రతా ప్రమాణాలు, గార్డ్రెయిల్స్ పేరుతో నిబంధనలు తెస్తుండటం వెనుక వ్యాపార వ్యూహాలు ఉన్నాయని టండన్ అన్నారు. తాము బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టినప్పటికీ.. తక్కువ ఖర్చుతో వస్తున్న ‘ఓపెన్-వెయిట్ మోడల్స్’ తమను అధిగమిస్తాయనే భయంతోనే ఈ నిబంధనలు తెరపైకి తెస్తున్నాయని చెప్పారు. ఈ ఆంక్షలు మరీ ఎక్కువగా ఉంటే ప్రపంచం మొత్తం చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాలు ప్రోత్సహిస్తున్న ఓపెన్ మోడల్స్ వైపు మళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
భారత్ లాంటి దేశాల్లో విభిన్న వేగంతో ఏఐ అడాప్షన్ ఉంటుందని, దేశ పరిస్థితులకు తగినట్లుగా ముందుకు వెళ్లాలని టండన్ సూచించారు. ఏఐ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ.. దాని దుర్వినియోగానికి పాల్పడే శక్తులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం వేచి చూడవని హెచ్చరించారు. భవిష్యత్తులో కంపెనీలు తమ అవసరాలకు తగినట్లుగా క్లోజ్డ్, ఓపెన్ మోడళ్లను మిళితం చేస్తూ ‘హైబ్రిడ్ ఏఐ మోడల్స్’ను ఎంచుకుంటాయని అంచనా వేశారు. వేగవంతమైన సమాధానం కావాలంటే ఖరీదైన మోడల్, అదే కొంచెం ఆలస్యమైనా తక్కువ ఖర్చుతో కూడిన మోడల్ కావాలంటే మరో ఆప్షన్ను ఎంచుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.
భారతదేశంలో యువ జనాభా, కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం ఉందని.. ఇది కొత్త సంస్థలకు గొప్ప అవకాశమని రోహిత్ టండన్ అన్నారు. అయితే ఇండియన్ ఐటీ కంపెనీల తమ సాంప్రదాయ వ్యాపార శైలిని మార్చుకోకపోతే, ఏఐ భవిష్యత్ ప్రయాణంలో వెనుకబడతాయని అన్నారు. సరికొత్త ఆలోచనలతో, మార్పుకు తగినట్లుగా వేగంగా రియాక్ట్ అయ్యే సంస్థలే రాబోయే రోజుల్లో ఏఐ రంగాన్ని శాసిస్తాయని తెలిపారు. మెుత్తానికి ఏఐ యుగంలో తమ ఆధిపత్యం, పేరు కనుమరుగవుతాయనే భయంలో సాంప్రదాయ టెక్ కంపెనీలు ఉన్నాయన్నది రియాలిటీ.