
అబుదాబి: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని హైజాక్ చేసి కూల్చివేయడానికి కుట్ర చేసిన ఒమన్‌కు చెందిన కో-పైలట్ అల్-హమ్మామికి సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు మాల్దీవియన్ పైలట్లను యూఏఈ పోలీసులు మంగళవారం (అక్టోబర్ 13) అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3న ఈ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సదరు పైలట్ల నిర్బంధం గురించి యూఏఈలోని మాల్దీవియన్ రాయబార కార్యాలయం వారి కుటుంబాలకు అధికారికంగా తెలియజేసిందని మాల్దీవియన్ న్యూస్ పోర్టల్ అధాధు నివేదించింది. అరెస్ట్ అయిన ఇద్దరు పైలట్లు నిందితుడు అల్-హమ్మామితో పని ప్రదేశంలో సన్నిహితంగా మెలిగేవారని.. వీరు ముగ్గురు ఒకే భవనంలో ఉండేవారని మాలేకు చెందిన మిహారు వార్తాపత్రిక నివేదించింది.
అయితే, ఈ ఘటనలో మాల్దీవులకు చెందిన ఇద్దరు పైలట్ల ప్రమేయం ఉందా లేదా అన్న దానిపై యూఏఈ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. ఈ కుట్ర వెనుక వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నారు. తమ దేశానికి చెందిన ఇద్దరు పైలట్ల అరెస్ట్‌పై వ్యాఖ్యానించడానికి మాల్దీవుల అధికారులు నిరాకరించారు.
అసలేం జరిగిందంటే..?
2026, సెప్టెంబర్ 30న ఆకాశంలో సినీ రేంజ్లో హైడ్రామా నడిచింది. ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని రాజధాని టెల్ అవీవ్ బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కాక్ పిట్లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. పైలట్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్‌కు చెందిన కో పైలట్ అల్-హమ్మామి కత్తితో దాడి చేశాడు. పైలట్ల మధ్య ఘర్షణతో విమానం అదుపు తప్పింది.
ఆకాశంలో విమానం కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్ పిట్ నుంచి అరుపులు వినిపించడం, విమానం ఆకస్మాత్తుగా ఎత్తు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోనకు గురయ్యారు. ఈ క్రమంలోనే పైలట్ స్మిత్ మచ్చర్ కాక్ పిట్ డోర్ ఓపెన్ చేశాడు. గమనించిన ప్రయాణికులు వెంటనే కాక్ పిట్లోకి ప్రవేశించి కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు.
►ALSO READ | డబ్బు, పలుకుబడి ఉంటే ప్రాణాలు తీసినా పర్వాలేదా..! కేరళ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల (ఆన్-డ్యూటీ సిబ్బంది) సహాయంతో విమానాన్ని ఈశాన్య సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సౌదీ పోలీసులు కో పైలట్ను అరెస్ట్ చేశారు. గాయపడ్డ పైలట్ను ఆసుపత్రికి తరలించారు.
కో పైలట్ విమానాన్ని క్రాష్ చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు యూఏఈ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లైదుబాయ్ విమాన ఘటనను యూఏఈ ఉగ్రవాద చర్యగా ప్రకటించింది.