Reading Time: 2 minutes
Vangaveeti Radhakrishna To Join Jana Sena Banners Emerge In Patamata

Vangaveeti Radhakrishna to Join Jana Sena: విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా?.. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతకాలంగా రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా కనిపించని రాధాకృష్ణ జనసేనలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అంతేకాకుండా ఆయన తన భార్యతో కలిసి జనసేనలో చేరనున్నారని తెలుస్తోంది.

వంగవీటి రాధాకృష్ణ ఇటీవల సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా కలిశారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో జరిగిన భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జనసేనలో చేరితే తగిన గుర్తింపు, ప్రాధాన్యం కల్పిస్తామనే భరోసా లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాధాకృష్ణ పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేనలో చేరుతున్నట్లు పటమటలో బ్యానర్లు వెలిశాయి. శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన నాయకులు బ్యానర్లు కట్టారు. అయితే రాధాకృష్ణ జనసేనలో చేరికపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇవాళ లేదా రేపు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. పరిమితంగా మాత్రమే కనిపిస్తున్నారు. సన్నిహితులు, వ్యక్తిగతంగా దగ్గరైన వారిని మాత్రమే కలుస్తున్నారనే చర్చ ఉంది. పార్టీలో తగిన పదవి లేదా రాజకీయ ప్రాధాన్యం దక్కకపోవడమే ఆయన మౌనానికి కారణమా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో రాధాకృష్ణ మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్తుపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జనసేనలో చేరిక వార్తలు తెరపైకి రావడంతో మరోసారి ఆయన పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వంగవీటి మోహనరంగా వారసుడిగా రాధాకృష్ణ రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఆయన ఏ పార్టీలో ఉన్నా, విజయవాడ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపగల నేతగా రాజకీయ వర్గాలు భావిస్తుంటాయి. గతంలో జనసేన తరఫున రాధాకృష్ణ విజయవాడ మేయర్‌గా పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. రాధాకృష్ణ టీడీపీలో కొనసాగుతారా? లేదా జనసేనలో చేరుతారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.