
హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2026 అక్టోబర్ 12న మొత్ం 56 ఫిర్యాదులు అందాయి. హైకోర్టు సర్వే ఆదేశాలున్నా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతూనేఉన్నారని.. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదులు చేశారు.
ఇంజాపూర్‌లో 74.16 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై ఫిర్యాదు చేశారు స్థానికులు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇంజాపూర్‌లో పార్కు స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొ్న్నారు.
ఇక కుంట్లూరులో 577 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి నల్ల చెరువు పరిసరాల్లో బోర్లతో నీటిని తోడి వ్యాపారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. నాగోలు–కుంట్లూరు మార్గంలో నాలా, 300 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. నాలాను ఆక్రమించి నిర్మించిన రెండు గదులు తొలగించాలని విజ్ఞప్తిచేశారు.
సాహెబ్‌నగర్ కలాన్‌లో 7.34 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై ఫిర్యాదు చేశారు. దేవరయాంజల్ కోమటికుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు కంప్లైంట్ చేశారు. దేవరయాంజల్‌లో ప్రభుత్వ, ఎండోమెంట్ భూముల్లో నిర్మాణాలు ఆపాలని వినతి చేశారు.
బహదూర్‌పల్లిలో 20 గుంటల ప్రభుత్వ భూమితో పాటు కౌకూరు–యాప్రాల్ చెరువులను కలిపే వరద కాలువ ఆక్రమణలను గురించి హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. వెన్‌రాగ్ ఎన్‌క్లేవ్‌లో వరద ప్రవాహానికి ఆటంకాలు కలుగుతున్నాయని కమిషనర్ రంగనాథ్ కు చెప్పారు. వంజర బస్తీలో రహదారి ఆక్రమణపై గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
ఆర్.కె.పురం చెరువు ఎఫ్‌టీఎల్‌లో పిగ్ స్లాటర్‌హౌస్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువులోకి వ్యర్థాలు వదులుతూ సుమారు 2 ఎకరాలు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. కవాడిగూడ ఘంటసాల ప్లేగ్రౌండ్‌ను కూరగాయల మార్కెట్‌గా మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంతలతో క్రీడలకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాప్రాంగణాన్ని కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో స్థానికులు విజ్ఞప్తి చేశారు.
మొత్తం 56 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని హైడ్రా అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.