
నిన్న మొన్నటి వరకూ వెండితెర వెనుక నిలబడి రక్తపాతం, మాఫియా సామ్రాజ్యాలతో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. తొలిసారి నటుడిగా అవతారమెత్తి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన రా యాక్షన్ థ్రిల్లర్ ‘DC’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో భారీ సంచలనంగా నిలిచిన తర్వాత, సన్ నెక్స్ట్ లో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా మరో ఓటీటీలో దాడికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో అక్టోబర్ 16 నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. చట్టానికి దొరకని అండర్‌వరల్డ్ దందాలతో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న దేవదాస్ అలియాస్ దాస్ (లోకేశ్ కనగరాజ్) కథే ఈ ‘DC’.
ఓ గాయని పరిచయంతో అతని క్రైమ్ ప్రపంచంలో అనుకోని కదలికలు మొదలవుతాయి. అదే సమయంలో తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించి పోరాడే చంద్ర (వామికా గబ్బి) ఎంట్రీతో కథ మరింత హింసాత్మకంగా మారుతుంది. ప్రేమ, తీరని పగ, నమ్మకద్రోహం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెడతాయి. స్క్రీన్‌పై లోకేశ్ కనగరాజ్ ప్రదర్శించిన రౌద్రం, తీవ్రమైన భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంజన కృష్ణమూర్తి, కస్తూరి రాజా, తలైవాసల్ విజయ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ రా అండ్ రస్టిక్ టేకింగ్ ప్రాణం పోసింది. థియేటర్లలో మిస్సయిన సినీ ప్రియులు, గ్యాంగ్‌స్టర్ కథలను ఇష్టపడే ఆడియన్స్ కోసం ఐదు భాషల్లో ఒకేసారి ఈ మాసివ్ హిట్ అందుబాటులోకి వస్తోంది.