
Vaibhav sooryavanshi: వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అభిమానులకు గుడ్ న్యూస్. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటికీ.. ఇప్పటివరకు స్వదేశంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఆ ఎదురుచూపులకు త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం (అక్టోబర్ 14) హైదరాబాద్‌లో జరగనున్న నాలుగో టీ20లో వైభవ్‌కు అవకాశం దక్కబోతుందన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. వైభవ్ సూర్యవంశీ తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసిన వైభవ్.. “Stay seated” (మీ స్థానాల్లోనే కూర్చోండి) అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో నాలుగో టీ20లో తనకు అవకాశం ఖాయమైందనే సంకేతాన్ని వైభవ్ ఇచ్చేసాడా..? లేక అతడి పీఆర్ టీమ్ ప్రచారం కోసం ఈ పోస్ట్ చేసిందా..? అనే చర్చ ఇంకా జరుగుతోంది.
వైభవ్ షేర్ చేసిన ఫొటోలు తాజా ప్రాక్టీస్‌కు సంబంధించినవి కావని అర్థమవుతుంది. ఆయన ఈ పోస్ట్ చేసిన సమయంలో భారత జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది. అప్పటివరకు టీమ్ ఇండియా ప్రాక్టీస్ కూడా ప్రారంభించలేదు. దీంతో పాత మ్యాచ్‌ల నెట్స్‌కు సంబంధించిన ఫొటోలను వైభవ్ షేర్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే “స్టే సీటెడ్” అనే క్యాప్షన్ మాత్రం అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. వెస్టిండీస్‌తో తొలి మూడు టీ20ల్లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అతడు.. మరో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. దీంతో నాలుగో టీ20లో శాంసన్ స్థానంలో వైభవ్‌కు అవకాశం కల్పించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. సంజూ శాంసన్‌ను పక్కన పెట్టి వైభవ్‌ను ప్లేయింగ్ XI లోకి తీసుకున్నారు. అయితే తొలి మూడు మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తిరిగి శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్‌లో సంజూ శాంసన్ జట్టులో లేకపోవడంతో వైభవ్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. అద్భుతంగా రాణించి “ప్లేయర్ ఆఫ్ ద సిరీస్”గా నిలిచాడు.
జింబాబ్వే పర్యటన తర్వాత భారత్ స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడింది. అయితే వైభవ్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత భారత జట్టు జపాన్ పర్యటనలో ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడినా.. అందులోనూ వైభవ్ బరిలోకి దిగలేదు. అయితే 2026 ఆసియా క్రీడల్లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో అతడు ఆడాడు. ఆ సమయంలో సంజూ శాంసన్ కూడా జట్టులోనే ఉన్నాడు.
ప్రస్తుతం వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వైభవ్‌కు మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. ఒక మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ నాలుగో టీ20లో ప్రయోగం చేస్తే వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కవచ్చని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే హైదరాబాద్‌లోనే వైభవ్ తన తొలి స్వదేశీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. అయితే తుది నిర్ణయం మాత్రం మ్యాచ్‌కు ముందు టీమ్ మేనేజ్మెంట్ తీసుకోనుంది.