
AP ZP Chairperson Reservations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది.. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో రిజర్వేషన్లు ఖరారు చేయగా.. ఇప్పుడు జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పదవులకు సంబంధించి జిల్లాల వారీగా రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 28 జిల్లాలకు సంబంధించిన జడ్పీ చైర్మన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలతో పాటు మహిళలకు కేటాయించారు. ఈ వివరాల ప్రకారం బీసీ కేటగిరీకి 7, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, ఓసీ లేదా జనరల్ కేటగిరీకి 11 పదవులు కేటాయించినట్లు పేర్కొన్నారు. మొత్తం 13 పదవులు మహిళలకు రిజర్వ్ చేశారు.
జిల్లాల వారీగా జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు
వెల్లడించిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పదవి బీసీ మహిళకు, అనంతపురం బీసీ కేటగిరీకి, అన్నమయ్య జనరల్ కేటగిరీకి కేటాయించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను ఎస్టీ కేటగిరీకి, బాపట్ల, చిత్తూరు జిల్లాలను జనరల్ మహిళలకు రిజర్వ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో జడ్పీ చైర్మన్ పదవులను ఎస్సీ మహిళలకు కేటాయించారు. తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో జనరల్ మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. కర్నూలు జిల్లాను బీసీ కేటగిరీకి, మార్కాపురం, నంద్యాల జిల్లాలను జనరల్ కేటగిరీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు..
ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సీ కేటగిరీకి, పల్నాడు జిల్లాలో జనరల్ మహిళకు, ప్రకాశం జిల్లాలో ఎస్సీ కేటగిరీకి జడ్పీ చైర్మన్ పదవులను కేటాయించారు. పోలవరం జిల్లాలో ఎస్టీ మహిళకు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్టీ కేటగిరీకి రిజర్వేషన్ కల్పించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ సత్యసాయి, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో జనరల్ కేటగిరీకి పదవులను కేటాయించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బీసీ మహిళలకు, విశాఖపట్నం జిల్లాలో బీసీ కేటగిరీకి రిజర్వేషన్ కల్పించారు. తిరుపతి జిల్లాలో ఎస్సీ మహిళకు, మార్కాపురం జిల్లాలో జనరల్ కేటగిరీకి పదవి కేటాయించారు..
ఏ కేటగిరీకి ఎన్ని పదవులు?
రిజర్వేషన్ల వివరాల ప్రకారం ఎస్సీ కేటగిరీకి 6, ఎస్టీ కేటగిరీకి 4, బీసీ కేటగిరీకి 7, ఓసీ లేదా జనరల్ కేటగిరీకి 11 జడ్పీ చైర్మన్ పదవులు కేటాయించినట్లు పేర్కొన్నారు. మహిళలకు మొత్తం 13 పదవులు రిజర్వ్ చేసినట్లు సమాచారం. ఈ రిజర్వేషన్లు జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంలో కీలకంగా మారనున్నాయి.