Reading Time: < 1 minute

రిక్రూట్మెంట్‌పై TCS సంచలన నిర్ణయం.. వారికే ఫస్ట్ ప్రయారిటీ!

Caption of Image.

ఐటీ దిగ్గజం TCS భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కంపెనీలో భవిష్యత్ కొత్త నియామకాల్లో 80 శాతం వరకు డిజిటల్, AI నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టీసీఎస్ ప్రతినిధి వెల్లడించారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయంలో ఏఐ వాటా 10 శాతానికి పెరిగిందని, భవిష్యత్తులో ఈ ఆదాయ వృద్ధి తమ లాభాల మార్జిన్లను మరింత మెరుగుపరుస్తుందని పేర్కొంది.

 తాము Q2లో కొత్తగా రిక్రూట్ చేసుకున్న 4వేల500 మందిలో సుమారు 25 నుంచి 30 శాతం మంది ఏఐ నిపుణులేనని టీసీఎస్ COO ఆరతి సుబ్రమణ్యం వెల్లడించారు. మొత్తం మీద 80 శాతం మంది కొత్త తరం టాలెంటేనని తెలిపారు. ఇదే నిష్పత్తి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని, మార్కెట్‌లో అటువంటి నైపుణ్యం కలిగిన నిపుణులు అందుబాటులో ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.

వేగంగా మారుతున్న టెక్ ప్రపంచంలో ఫ్రెషర్లకు ప్రాధాన్యం ఉంటుందా లేక మిడ్-కెరీర్ నిపుణులకు లాభమా అనే ప్రశ్నకు టీసీఎస్ సీఈఓ, ఏండీ కే. కృతివాసన్ స్పందిస్తూ.. “ఎవరైతే కొత్త విషయాలను నేర్చుకోవడానికి, పాత వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారో వారికే అన్నివేళలా స్పష్టమైన ప్రయోజనం ఉంటుంది” అని అన్నారు. ఒక మిడ్-లెవెల్ ఇంజనీర్ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్, డొమైన్‌ను బాగా అర్థం చేసుకోగలరని.. జూనియర్ ఇంజనీర్ ఆ అనుభవాన్ని పొందడానికి కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.

కస్టమర్లు మొదట చిన్న వర్టికల్‌లో ఏఐ డీల్స్‌ను కుదుర్చుకుంటున్నారని.. ఆ పెట్టుబడుల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్న తర్వాత ఇతర విభాగాలకు కూడా ఏఐని విస్తరిస్తున్నారని ఆరతి సుబ్రమణ్యం తెలిపారు. ప్రస్తుతం తాము చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక రూపంలో ఏఐ భాగస్వామ్యం అవుతోందని, ఏఐ డీల్స్ పరిమాణం పెరిగే కొద్దీ కంపెనీ లాభదాయకత కూడా పెరుగుతుందని కృతివాసన్ ధీమా వ్యక్తం చేశారు. నిష్ టాలెంట్‌లో పెట్టుబడులతో పాటు భవిష్యత్తులో విలీనాలు, కొనుగోళ్లు, భాగస్వామ్యాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.