Reading Time: 2 minutes
దీపావళికి స్వీట్లు అడిగితే రూ. 70 కోట్ల ట్యాంక్ డెలివరీ.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చుక్కలు చూపించిన ఆకతాయిలు!

తమిళనాడులోని మదురైకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీరామణి చేసిన ఒక చిన్న విజ్ఞప్తి అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. దీపావళికి ఫాలోవర్స్ తనకి స్వీట్ బాక్స్ పంపాలని కోరుతూ తన అడ్రస్, ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ, ఆకతాయిలు దీనిని అవకాశంగా తీసుకుని అతనికి చుక్కలు చూపించారు. ఆన్‌ లైన్‌ ఆర్డర్స్‌తో నిరంతరం డెలివరీ బాయ్స్ అతని ఇంటికి క్యూ కట్టారు. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే..

అతిథిగా వచ్చిన కష్టాలు.. క్యాష్ ఆన్ డెలివరీ ప్రంక్!

వీరామణి చేసిన పోస్ట్‌ను ఆకతాయిలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అతని చిరునామాను ఉపయోగించి ఆన్‌లైన్‌లో భారీ ఎత్తున క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు చేయడం ప్రారంభించారు. క్షణాల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ అతని ఇంటి ముందుకు క్యూ కట్టారు. రూ. 1.69 లక్షల విలువైన టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు క్యాష్ ఆన్ డెలివరీలో వచ్చాయి. తాను ఆర్డర్ చేయని ఆ వస్తువులను తీసుకునేందుకు అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.

రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్, జేసీబీ ఆర్డర్!

ఈ ప్రాంక్ ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో కొందరు మరింత ముందుకు వెళ్లి, ఏకంగా జేసీబీ ఎక్స్‌కవేటర్లు, రూ. 70 కోట్ల విలువైన మిలిటరీ ట్యాంక్‌లను కూడా వీరామణి పేరు మీద క్యాష్ ఆన్ డెలివరీకి ఆర్డర్ చేసినట్లు స్క్రీన్‌షాట్లు వైరల్ చేశారు. డెలివరీ బాయ్స్ పదే పదే ఇంటికి రావడంతో విసిగిపోయిన వీరామణి, నా వద్ద డబ్బులు లేవు, దయచేసి ఇలాంటి ఆర్డర్లు ఆపండి, మీ కాళ్లు మొక్కుతాను అంటూ సోషల్ మీడియాలో వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

 

View this post on Instagram

 

A post shared by veeramani (@veeramani_121)

ఇల్లు వదిలి పారిపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్

ఎంత చెప్పినా ఆకతాయిల వేధింపులు ఆగకపోవడంతో, విసిగిపోయిన వీరామణి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తాను ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్తున్నట్లు ప్రకటించాడు. ప్రజలు తనను వెంబడిస్తూ తిడుతున్నారని, కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉండాల్సి వస్తోందని తెలిపాడు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఏదేమైనప్పటికీ, వీరామణి పడిన పాట్లు ప్రస్తుతం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తూనే, మరోవైపు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..