
బ్రకోలి ఈ పేరు వింటే చాలు జనాలు ఆమడ దూరంపరిగెత్తుతారు. ఎంతటి ఆరోగ్యమైన.. బలవర్దకమైన ఫుడ్ అయినా సరే తినడానికి అస్సలు ఇష్టపడరు. కాని దీనిని చేయాల్సిన రీతిలో పలావ్ చేస్తే చాలు లొట్ట లేసుకుంటూ లాగించేస్తారు. ముద్ద ముద్దకు స్వర్గంలో ఉన్న అనుభూతిని పొందుతాను. మరి ఈ బ్రకోలి పలావ్ను ఎలా తయారు చేయాలి.. ఏమేమి పదార్ధాలు కావాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
బ్రకోలి పలావ్ తయారీకి కావలసినవి
- బ్రకోలి – 200 గ్రాములు
- ఉడికించిన సోనా మసూరి అన్నం – 6 కప్పులు
- నెయ్యి – 2 టేబుల్ స్పూన్ (చివర్లో మరో టీస్పూన్)
- జీడిపప్పులు – 16
- ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు
- పచ్చిమిర్చి – 6
- వెల్లుల్లి రెబ్బలు – 4
- పసుపు -అర టీస్పూన్
- గరం మసాలా – 2 టీస్పూన్లు
- మిరియాల పొడి – అర టీస్పూన్
- కిచెన్ కింగ్ మసాలా – 2 టీస్పూన్లు
- ఉప్పు – రుచికి సరిపడా
- నిమ్మరసం – ఒక టీస్పూన్
- నువ్వుల నూనె – కొద్దిగా
బ్రకోలి పలావ్ తయారీ విధానం
ముందుగా సోనా మసూరి అన్నంలో కొద్దిగా నువ్వుల నూనె వేసి ఒక వెడల్పాటి గిన్నెలో ఆరపెట్టాలి. నువ్వుల నూనె వేయడం వలన అన్నం ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లను మరిగించి ఆవిరి వచ్చేలా ఉండాలి. ఈ ఆవిరిలో బ్రకోలి ముక్కలను 5 నిమిషాలపాటు ఆవిరిపై మరీమెత్తగా కాకుండా కాస్త క్రిస్పీగా ఉండేలా ఉడికించాలి. బ్రకోలి ఉడికిన నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరల స్టవ్ వెలిగించి మందంగా.. వెడల్పుగా ఉన్న కళాయిని వేడి చేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడిచేయాలి. వేడిగా ఉన్న నెయ్యిలో జీడిపప్పులను దోరగా వేయించి ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు.. వెల్లుల్లి రెబ్బలు.. పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ దోరగా వచ్చే వరకు వేగిన తరువాత అందులో గరం మసాలా, కిచెన్ కింగ్ మసాలా, మిరియాల పొడి, పసుపు వేసి మంటను పూర్తిగా స్విమ్ లో ఉంచాలి. ఓ రెండు నిమిషాల పాటు వేయిస్తూ పచ్చి వాసన పోయేలా కలుపుతూ ఉండాలి. రుచికి సరిపడ ఉప్పును వేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో ఆవిరిపై ఉడికించిన బ్రకోలి ముక్కలు వేసి ఒక్క నిమిషం పాటు మసాలా పట్టేలా కలపాలి. ఆ తరువాత చల్లార్చిన అన్నాన్ని వేసి ఈ మిశ్రమంలోని మసాలాలన్నీ అన్నానికి పట్టేలా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇందులో రుచిగా ఉండేందుకు నిమ్మరసం, వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, మరో అర టీస్పూన్ నెయ్యి పైన వేసి బాగా కలపాలి. ఇక -అంతే గుమగుమలాడే వేడివేడి బ్రకోలి పలావ్ రెడీ. దీనిని కమ్మటి పెరుగు రైతాతో కానీ, ఇష్టమైన కుర్మాతో తింటే నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.