
పారిస్: ఫ్లైదుబాయ్ విమాన ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు రాకపోకలు సాగించే తమ విమానాల్లో పాకిస్తానీ పైలట్లు, క్యాబిన్ సిబ్బందిపై ఎయిర్ ఫ్రాన్స్ నిషేధం విధించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ దేశానికైనా విమానాలు నడిపేటప్పుడు ఆయా దేశాల చట్టాలను పాటించాల్సి ఉంటుందని.. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ జారీ చేసిన నూతన భద్రతా ఆదేశాలకు కట్టుబడి పాకిస్తాన్ పైలట్లు, క్యాబిన్ సిబ్బందిని ఇజ్రాయెల్ రూట్లలో నడిచే విమానాల్లో నియమించబోమని ఎయిర్ ఫ్రాన్స్ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో పాటు మరికొన్ని దేశాల పైలట్లు, సిబ్బందికి కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది.
2026, సెప్టెంబర్ 30న దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని హైజాక్ చేసి ఇజ్రాయెల్‌లో కూల్చేందుకు ఒమన్‌కు చెందిన కో పైలట్ కుట్ర చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇండియన్ పైలట్ వీరోచిత పోరాటంతో ఇజ్రాయెల్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ విమానయాన భద్రతా నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌తో అధికారికంగా దౌత్య సంబంధాలు లేని పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, అల్జీరియా, ట్యునీషియా వంటి సుమారు 31 దేశాల పౌరసత్వం కలిగిన పైలట్లు, సిబ్బంది తమ దేశ వైమానిక పరిధిలోకి రాకూడదని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒక దేశం అనుమతి లేనిది ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించడం నిషేధం.
►ALSO READ | మోస్ట్ డేంజరస్ దేశాలు ఇవే.. ప్రపంచంలో అత్యధిక క్రైం దేశం ఏదో తెలుసా..?
ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ నిషేధం విధించిన 31 దేశాల పైలట్లు, క్యాబిన్ సిబ్బందిపై పలు విమానయాన సంస్థలు నిషేధం విధిస్తున్నాయి. కేవలం ఎయిర్ ఫ్రాన్స్ మాత్రమే కాకుండా అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్, చెక్ రిపబ్లిక్కు చెందిన స్మార్ట్వింగ్స్ వంటి మరికొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఇజ్రాయెల్ విధించిన ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తున్నాయి.