
దసరా పండుగ సందడి మొదలవుతుండటంతో థియేటర్లలోనే కాదు.. ఓటీటీ వేదికలపైనా వినోదాల జాతర మొదలుకానుంది. కొత్త సినిమాలు, ఉత్కంఠ రేపే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు, ఎమోషనల్ లవ్ స్టోరీలు, సూపర్ నేచురల్ కామెడీలు, సెలబ్రిటీల మధ్య మైండ్ గేమ్స్‌తో డిజిటల్ స్క్రీన్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో వరుసగా క్రేజీ కంటెంట్ స్ట్రీమింగ్కు రానుంది. ఈ వారం మొత్తం 9 దక్షిణాది సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. మరి ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది? దేని కథేంటి? ఓ లుక్కేద్దాం!
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ది ట్రెయిటర్స్ తెలుగు’
హీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 10 ఎపిసోడ్లతో రూపొందిన ఈ రియాలిటీ గేమ్ షోలో 20 మంది సెలబ్రిటీలు పోటీపడనున్నారు. నమ్మకం, మోసం, వ్యూహాలు, రహస్య పొత్తుల చుట్టూ తిరిగే ఈ గేమ్‌లో ఎవరు నిజాయితీపరులు? ఎవరు వెన్నుపోటు పొడిచే ట్రెయిటర్లు? అన్నది ఆసక్తికరంగా మారనుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఎన్న విలై’
తమిళ చిత్రం ‘ఎన్న విలై’ అక్టోబర్ 16న నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. రామేశ్వరానికి చెందిన తవాసి ముత్తు సముద్రంలో నాణేలు సేకరిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అనుకోకుండా అతడికి విలువైన బంగారు లాకెట్ దొరుకుతుంది. దానిని సొంతం చేసుకోకుండా అధికారులకు అప్పగించడంతో అతడి జీవితంలో అనూహ్య పరిణామాలు మొదలవుతాయి. నిజాయితీకి పరీక్ష పెట్టే ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
సోనీ లివ్‌లో ‘డీసీ’
అక్టోబర్ 16న సోనీ లివ్‌లో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. దేవదాస్ అనే తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తి, తన అనుచరులతో కలిసి ఓ రైతు కుటుంబాన్ని కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. ప్రేమ, ప్రతీకారం, కుటుంబ రహస్యాలు, ద్రోహం కలగలిసిన ఈ కథలో దేవదాస్ తన గతాన్ని ఎదుర్కొంటూ శత్రువుల నుంచి ఎలా బయటపడతాడన్నది కీలకం.
సన్ నెక్స్ట్లో ‘కాగితం పడవలు’
వర్థన్ గుర్రాల, కృష్ణప్రియ నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా ‘కాగితం పడవలు’ అక్టోబర్ 16 నుంచి సన్ నెక్స్ట్లో అందుబాటులోకి రానుంది. రెండు గ్రామాల మధ్య పాత వైరం.. ఆ గ్రామాలకు చెందిన రామ్, గోదావరి మధ్య ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. అపార్థాలు, కుటుంబాల వ్యతిరేకత, స్నేహితుల ప్రేమకథల్లో విషాద పరిణామాలు.. ఇలా భావోద్వేగాలతో సాగే ఈ చిత్రం ప్రేమకథలను ఇష్టపడేవారికి మంచి ఎంపిక.
జీ5లో ‘ఆశ’
ఉర్వశి, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మిస్టరీ డ్రామా ‘ఆశ’ అక్టోబర్ 16న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. భర్తను కోల్పోయిన ఓ తల్లి తన కుమార్తె ప్రమాదానికి ట్రక్ డ్రైవర్ జీమన్ కారణమని అనుమానిస్తుంది. ఆ అనుమానం క్రమంగా తీవ్ర రూపం దాల్చి, అతడిని కిడ్నాప్ చేసే స్థాయికి చేరుతుంది. ఆమె అనుమానం నిజమేనా? లేక అపోహలే ఆమెను ప్రమాదంలోకి నెడుతున్నాయా? అన్నది ఉత్కంఠ రేపుతుంది.
►ALSO READ | Haindava Teaser : దేవుళ్ల విగ్రహాలు మిస్సింగ్.. నాస్తిక పోలీస్ ఆఫీసర్ చేతికి కేసు ఇన్వెస్టిగేషన్ !
సన్ నెక్స్ట్లో ‘ఒరు అన్వేషణతిన్ తుడక్కం’
మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఒరు అన్వేషణతిన్ తుడక్కం’ అక్టోబర్ 16న సన్ నెక్స్ట్లో విడుదల కానుంది. నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే జీవన్ థామస్ కనిపించకుండా పోతాడు. ఆరు నెలల తర్వాత దర్యాప్తు ప్రారంభమై, కేరళలోని కీలక ప్రాంతాల మీదుగా సాగుతూ ఓ శక్తిమంతమైన కుటుంబం చుట్టూ తిరుగుతుంది. సాధారణ మిస్సింగ్ కేసు వెనుక దాగిన రహస్యాలే ఈ కథకు బలం.
జియోహాట్‌స్టార్‌లో ‘కప్పి స్క్వాడ్’
నలుగురు యువకులు తమ కలలను నిజం చేసుకోవడానికి కేఫ్ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత విభేదాలు, దెబ్బతిన్న అహాలు వారి స్నేహాన్ని పరీక్షిస్తాయి. అక్టోబర్ 15న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ ‘కప్పి స్క్వాడ్’ సిరీస్ యువతకు కనెక్ట్ అయ్యే అంశాలతో అలరించనుంది.
సైనా ప్లేలో ‘అదినాసం వెల్లిపోక్కం’
అక్టోబర్ 16న సైనా ప్లేలోకి రానున్న కామెడీ ఎంటర్టైనర్ ‘అదినాసం వెల్లిపోక్కం’. ఇందులో నలుగురు కాలేజీ విద్యార్థులు ప్రమాదకరమైన వ్యక్తికి చెందిన విలువైన వస్తువులను అనుకోకుండా దొంగిలిస్తారు. వారిని పట్టుకునేందుకు అతడు కాలేజీలోకి ప్రవేశించడంతో గందరగోళం మొదలవుతుంది. విద్యార్థులు, ప్రిన్సిపాల్, విలన్ మధ్య జరిగే ఛేజ్ నవ్వులు పంచనుంది.
మనోరమ మ్యాక్స్‌లో ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’
అక్టోబర్ 15న మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ . ఈ మూవీలో రెండేళ్ల కోమా నుంచి బయటపడిన రూబెన్‌కు అసాధారణమైన వినికిడి శక్తి వస్తుంది. తనకు పాటలు పాడిన నర్స్ సుసన్నాను వెతుకుతూ అతడు ఓ ప్రమాదకరమైన కిడ్నాప్ మిస్టరీలో చిక్కుకుంటాడు.
మొత్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో 9 టైటిల్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రియాలిటీ షోలు ఇష్టపడేవారికి ‘ది ట్రెయిటర్స్ తెలుగు’, ఉత్కంఠభరిత కథల కోసం ‘ఆశ’, ‘ఒరు అన్వేషణతిన్ తుడక్కం’, ప్రేమకథల కోసం ‘కాగితం పడవలు’, నవ్వుల కోసం ‘అదినాసం వెల్లిపోక్కం’ మంచి ఎంపికలు. అంటే ఈ వారాంతం ఇంట్లోనే కూర్చుని బోర్ కొట్టకుండా చూసేందుకు కంటెంట్‌కు కొదవ లేదు.