Reading Time: < 1 minute
Uttarakhand Bans Gutkha Pan Masala For One Year

Gutkha, Pan Masala Ban: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలా, పొగాకు, నికోటిన్ కలిగిన ఇతర ఆహార ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. 2026 అక్టోబర్ 13 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఏ పేరుతో విక్రయించినా నిషేధిత ఉత్పత్తులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ ఆహార భద్రత, ఔషధ పరిపాలన కమిషనర్ వినయ్ శంకర్ పాండే మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006లోని సెక్షన్ 26తో పాటు సెక్షన్ 92, సెక్షన్ 30(2) కింద కల్పించిన అధికారాలను వినియోగించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గతంలోనూ పలుమార్లు నిషేధం
ఉత్తరాఖండ్‌లో గుట్కా, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై నిషేధం విధించడం ఇదే తొలిసారి కాదు. ప్రభుత్వం 2013లోనే ఈ ఉత్పత్తులపై ఆంక్షలు విధించింది. ఆ తర్వాత 2015, 2019లోనూ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసి నిషేధాన్ని కొనసాగించింది. అయినప్పటికీ, ఈ ఉత్పత్తుల వినియోగం కొనసాగుతుండటంతో ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలకు ఉపక్రమించింది.

చట్టం ఉన్నా కొనసాగుతున్న వినియోగం
ఆహార భద్రత, ప్రమాణాల (అమ్మకాలపై నిషేధం, పరిమితులు) నిబంధనలు–2011లోని నిబంధన 2.3.4 ప్రకారం, ఆహార ఉత్పత్తుల్లో పొగాకు, నికోటిన్‌ను పదార్థాలుగా ఉపయోగించడం నిషేధం. అయినప్పటికీ, గుట్కా, పాన్ మసాలా వంటి ఉత్పత్తుల్లో వీటి వినియోగం కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో నిషేధిత ఉత్పత్తుల తయారీ నుంచి విక్రయాల వరకు అన్ని దశలపై ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడటం, పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం భావిస్తోంది.