Reading Time: < 1 minute
Ap Municipal Elections St Mayor Posts For Mangalagiri Tadepalli

AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రాథమిక కసరత్తు పూర్తయినట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వారీగా కేటాయించే స్థానాలపై దాదాపుగా నిర్ణయానికి రాగా.. తుది కసరత్తు కొనసాగుతోంది. నేడు మధ్యాహ్నం పూర్తి స్థాయి రిజర్వేషన్ల జాబితా విడుదల కానుంది.

కార్పొరేషన్లలో మేయర్ పదవుల రిజర్వేషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశంపై అధికారులు కసరత్తు జరుగుతున్నారు. అలాగే రాజమండ్రి, కర్నూలు కార్పొరేషన్లలో మేయర్ పదవులను ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను జనరల్ కేటగిరీలో చేర్చే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. తుది జాబితా విడుదలైన తర్వాతే ఏ కార్పొరేషన్‌లో ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఖరారైందన్న అంశంపై స్పష్టత రానుంది.

మున్సిపాలిటీల విషయానికి వస్తే.. బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఎన్నికల్లో మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. 50 శాతం చోట్ల మహిళలకు ఛైర్‌పర్సన్‌ పదవులు దక్కనున్నాయి. మేయర్ పదవుల్లో దాదాపు ఎనిమిది స్థానాలను మహిళలకు కేటాయించే అవకాశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 దక్కనున్నాయి. నేడు మధ్యాహ్నం విడుదలయ్యే పూర్తి స్థాయి జాబితాతో మేయర్, మున్సిపల్ పదవుల రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.