Reading Time: < 1 minute

హైదరాబాద్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి .. రూ.21 లక్షల  నగదుతో పరార్

Caption of Image.

హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు యువకులు భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, అతనితో పాటు వచ్చిన వారిపై దాడి చేసి నగదుతో పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎర్రగడ్డకు చెందిన అమరేంద్ర యూఎస్‌డీటీ (USDT) కొనుగోలుకు సంబంధించి తన మిత్రుల సలహా మేరకు భారతీయ కరెన్సీని డాలర్లలోకి మార్చాలని భావించాడు. ఇందుకోసం బైనాన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో ఆదివారం బజార్‌ఘాట్‌లోని హిమాలయ హోటల్ పక్కన ఉన్న ఓ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ సుమైద్, సయ్యద్‌లతో క్రిప్టో కరెన్సీ లావాదేవీల గురించి చర్చించాడు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న రూ.21 లక్షల నగదును వారికి చూపించాడు.

లావాదేవీలు జరుగుతున్న సమయంలో సుమైద్ యూఎస్‌డీటీ లావాదేవీ చేయకుండా అమరేంద్ర కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లినట్లు సమాచారం. అనంతరం అతనితో పాటు వచ్చిన విజయ్ కుమార్, విజయేష్‌లపై కూడా దాడి చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.ఈ క్రమంలో రూ.4 లక్షలు కింద పడిపోయినట్లు సమాచారం. మిగిలిన నగదును నిందితులు తీసుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ ఘటనతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అమరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు వివరాలను పరిశీలిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీల పేరుతో జరిగిన ఈ దోపిడీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులను గుర్తించి నగదును తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

 

©️ VIL Media Pvt Ltd.