Reading Time: 2 minutes

రెండేళ్ల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం.. విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. గిట్లయితే మిడిల్ క్లాస్ బతుకుడు కష్టమే !

Caption of Image.

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, భారీగా పెరిగిన వ్యయాల కారణంగా.. సెప్టెంబర్‌లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇంటి కిరాయి మాత్రమే కాదు పెరుగుతున్న ఖర్చులు కూడా మధ్య తరగతి వర్గాలను రోజురోజుకూ కుంగదీస్తున్నాయి. మధ్య తరగతి బడ్జెట్లపై అదనపు ఒత్తిడి పెరిగింది. ధరల పెరుగుదల ప్రభావం గ్రామీణ ప్రాంతాలలో కూడా మరింత స్పష్టంగా కనిపించింది.

పట్టణ ప్రాంతాలతో పోలిస్తే ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం రెండూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికంగా ఉండటం గమనార్హం. అక్టోబర్ 12న సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వినియోగదారుల ధరల సూచిక (CPI) లెక్కించిన.. రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులోని 4.83% నుంచి సెప్టెంబర్కు 5.54%కి పెరిగింది. అదే సమయంలో.. ఆహార ద్రవ్యోల్బణం 5.97% నుంచి 7.74%కి పెరిగింది.

తాజా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు.. PHDCCI ప్రైస్‌నెక్సస్ ఇంజిన్ (PPNE) అంచనా వేసిన 4.42% కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ భారతదేశంలో ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులోని 5.24 శాతం నుంచి 6.08 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఇదే రేటు 4.31 శాతం నుంచి 4.88 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 7.18 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో 8.06 శాతంగా నమోదైంది. ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెలలో 48.78 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో 108.09 శాతానికి పెరిగింది.

►ALSO READ | సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని అసెంబ్లీ తీర్మానం

అల్లం ధరలు ఈ ఏడాది కాలంలో 62.85 శాతం పెరగ్గా, వెల్లుల్లి ద్రవ్యోల్బణం 54.62 శాతానికి పెరిగింది. నిమ్మకాయల ధరలు కూడా భారీగా పెరిగాయి, ఆగస్టులో 15.15 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 36.41 శాతానికి చేరుకుంది. వెండి ఆభరణాల ద్రవ్యోల్బణం 87.80 శాతంగా నమోదైంది. అయితే.. కొన్ని ఆహార పదార్థాల ధరలు తగ్గాయి కూడా.

బంగాళాదుంపల ధరలు గత ఏడాదితో పోలిస్తే 11.50 శాతం తక్కువగా ఉండగా, టమాటా ధరలు 8.62 శాతం తగ్గాయి. సెప్టెంబర్ గణాంకాలు తాత్కాలికమైనవి. అక్టోబర్ 2026 వరకు ఉన్న తదుపరి వినియోగదారుల ధరల సూచిక (CPI) నవంబర్ 12న విడుదల కానుంది.

©️ VIL Media Pvt Ltd.