ఆయుర్వేదంలో తులసిని ‘మూలికల రాణి’ అని పిలుస్తారు. మన ఇంట్లోనే దొరికే తులసి ఆకుల్లో ఎన్నో అద్భుత మూలికా గుణాలు దాగి ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేవగానే పరగడుపున తులసి నీటిని తాగడం వల్ల శరీరానికి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ మెరుగుపడటం నుంచి రోగనిరోధక శక్తి పెరగడం వరకు ఈ తులసి నీరు చేసే మేలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడి తగ్గుతుంది.. ప్రశాంతత లభిస్తుంది: తులసి ఒక సహజ సిద్ధమైన అడాప్టోజెన్‌గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇక రోజూ ఉదయాన్నే పరగడుపున తులసి నీరు తాగడం వల్ల మానసిక ఆందోళన తగ్గి, రోజంతా మనస్సు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: తులసిలో విటమిన్ సి, జింక్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇక క్రమం తప్పకుండా ఈ నీటిని తాగడం వల్ల శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, సీజనల్ జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది: ఉదయాన్నే తులసి నీరు తాగడం వల్ల కడుపులో జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఇక గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఉపశమనాన్ని అందించి పొట్టను శుభ్రపరుస్తుంది.
శ్వాసకోశ ఆరోగ్యం.. బ్లడ్ షుగర్ కంట్రోల్: తులసిలోని యాంటీమైక్రోబియల్ గుణాలు ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తొలగించి గొంతు నొప్పి, ఆస్తమా సమస్యలను తగ్గిస్తాయి. అలాగే, రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరిచి గ్లూకోజ్ పరిమాణాన్ని అదుపులో ఉంచుతుంది. కాబట్టి మధుమేహం (షుగర్) ఉన్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఇక తులసి నీటిని తయారు చేయడం చాలా సులభం. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ తర్వాత గోరువెచ్చగా తాగితే సరిపోతుంది. రోజువారీ అలవాట్లలో ఈ చిన్న మార్పు చేసుకుని పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం..
గమనిక: ఇది కేవలం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. మీకు ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా ప్రత్యేక చికిత్సలు పొందుతున్నా మీ వైద్యుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
The post పరగడుపున ఈ నీళ్లు తాగితే జీర్ణక్రియ నుంచి ఇమ్యూనిటీ వరకు ప్రయోజనాలే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.