Reading Time: 3 minutes

రామ్‌లీలా మైదాన్కు ఫుల్ డిమాండ్.. బుకింగ్‌ అంత ఈజీ కాదు.. రోజుకు రూ.లక్షా 21 వేలు !

Caption of Image.

ఒకవైపు  కాక్రోచ్ పార్టీ, మరోవైపు ఇండియా కూటమి ఆందోళనలు ఉధృతం చేస్తున్న క్రమంలో ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ దగ్గర నిరసనలు, ఆందోళనలకు వీలు లేదని తేల్చిచెప్పారు. ప్రత్యామ్నాయంగా  రామ్‌లీలా మైదాన్, బురారీ గ్రౌండ్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌లను కొత్త వేదికలుగా గుర్తించారు. అయితే, వీటిలో అత్యధిక డిమాండ్ ఉండే వేదిక రామ్‌లీలా మైదాన్‌. ఏడాదికి ముందు నుంచే ఈ మైదాన్ బుకింగ్స్ అవుతుంటాయి. అంత డిమాండ్ ఉన్న వేదిక ఇది. 

అయితే జంతర్ మంతర్ ను ఎత్తివేడయంతో ఆందోళన చేస్తున్న పార్టీలు రామ్ లీలా మైదాన్ ను బుకింగ్ చేసుకుంటాయి. నిరసనలకు వేదికగా చేసుకుంటాయా..? అనేది ముందు ముందు చూడాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ ఏడాది చివరి వరకు దాదాపు అన్ని తేదీలు బుకింగ్ అయిపోయాయి.  కేవలం మూడు తేదీలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో మాత్రమే ప్రస్తుతం బుకింగ్‌కు అవకాశం ఉంది.

రోజుకు రూ.1.21 లక్షలు.. ఎలా చెల్లించాలి?

సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామ్‌లీలా మైదాన్‌లో దాదాపు 50 వేల మంది పాల్గొనే కార్యక్రమాలను నిర్వహించవచ్చు. ఈ మైదాన్‌ను ఒక రోజు పాటు బుక్ చేసుకోవాలంటే రూ.50 వేల అద్దెతో పాటు రూ.55 వేల తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. పన్నులు కలిపితే  ముందస్తుగా మొత్తం లక్షా 21 వేల రూపాయలు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఉద్యానవన శాఖ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆమోదం లభించాలంటే ఢిల్లీ పోలీసుల నుంచి  ఎన్‌ఓసీ  తప్పనిసరి.

అయితే, నిరసనలు, సమావేశాల కోసం మైదానంలోని ఒక చిన్న భాగాన్ని ఉచితంగా వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. కానీ, అక్కడ కేవలం 150 మంది మాత్రమే పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నిరసనకారులకు ఆర్థిక భారం?

జంతర్ మంతర్‌లో నిరసనల నిర్వహణకు ఇలాంటి బుకింగ్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో, కొత్తగా కేటాయించిన మైదానాల అద్దె ధరలపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక బుకింగ్ ఖర్చులు చిన్న సంస్థలు, స్థానిక సంఘాలకు భారంగా మారవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మైదానాన్ని ఉచితంగా వినియోగించుకునేందుకు అనుమతిస్తే మున్సిపల్ సంస్థకు రోజుకు కనీసం రూ.50 వేల ఆదాయం తగ్గుతుందని ఒక అధికారి పేర్కొన్నట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.

రామ్‌లీలా మైదాన్‌పై ఆప్ ప్రశ్నలు

రామ్‌లీలా మైదాన్‌ను నిరసన వేదికగా ప్రకటించినప్పటికీ, అక్కడ ఇప్పటికే పలు కార్యక్రమాలకు బుకింగ్‌లు ఉండటంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నలు లేవనెత్తారు.

ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేసిందని, రామ్‌లీలా మైదాన్‌లో ఇప్పటికే రెండు రామ్‌లీలా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నిరసనలు ఎలా నిర్వహిస్తారని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.

దసరా, దీపావళి వంటి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో మైదాన్‌ను వివిధ కార్యక్రమాలు, వేడుకల కోసం ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు పౌర అధికారులు తెలిపారు.

ట్రాఫిక్ సమస్యలపై ఆందోళన

రామ్‌లీలా మైదాన్ మూడు ఆసుపత్రులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని రద్దీ ప్రాంతంలో ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే కార్యక్రమాల సమయంలో పరిసర రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రధాన కార్యక్రమాల సందర్భంగా అసఫ్ అలీ రోడ్డుపై వాహనాల రాకపోకలను ఒకవైపు మాత్రమే అనుమతించి, దేశ్‌బంధు గుప్తా రోడ్డువైపు వెళ్లే ట్రాఫిక్‌ను సమీపంలోని జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌కు మళ్లిస్తుంటారు. ఈ రెండు రహదారులపై ఇప్పటికే రద్దీ, ఆక్రమణలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

2014లో ఇదే మైదానంలో నిర్వహించిన బీజేపీ ర్యాలీ కారణంగా, సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఐటీఓ ప్రాంతం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ఘటనను కూడా ఒక అధికారి గుర్తుచేశారు.

చెరువు నుంచి చారిత్రక రాజకీయ వేదికగా రామ్‌లీలా మైదాన్‌..

రామ్‌లీలా మైదాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1930 వరకు ఈ ప్రాంతం చెరువుగా ఉండేది. రామ్‌లీలా ప్రదర్శనల కోసం దానిని పూడ్చి చదును చేశారు. 1932లో ప్రారంభమైన రామ్‌లీలా సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

స్వాతంత్ర్యం తర్వాత 1951లో శరణార్థుల జీవనోపాధికి సంబంధించిన అవసరాల కోసం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. క్రమంగా ఇది రాజకీయ ర్యాలీలు, బహిరంగ సభలకు ప్రముఖ వేదికగా మారింది.

1952లో జమ్మూ కాశ్మీర్‌ను భారత యూనియన్‌లో పూర్తిగా విలీనం చేయాలని కోరుతూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇక్కడ సత్యాగ్రహం చేపట్టారు. 1956, 1957లో జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడ భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1962లో క్వీన్ ఎలిజబెత్ II భారత పర్యటన సందర్భంగా ఆమె గౌరవార్థం జరిగిన కార్యక్రమం కోసం శాశ్వత వేదికను నిర్మించారు.

1971లో పాకిస్థాన్‌పై భారత్ విజయం అనంతరం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఇక్కడ ర్యాలీలో ప్రసంగించారు. 1974 నవంబర్ 26న సోవియట్ నాయకుడు లియోనిడ్ బ్రెజ్నెవ్ గౌరవార్థం కూడా బహిరంగ సభ నిర్వహించారు.

1975 జూన్ 25న అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోజున సోషలిస్ట్ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఈ మైదానంలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు.

ఇటీవలి కాలంలో అరవింద్ కేజ్రీవాల్ 2013, 2015, 2020 సంవత్సరాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు.

మూడు కొత్త వేదికలు.. అందుబాటుపై సందేహాలు

ఢిల్లీ పోలీసులు అక్టోబర్ 11న జారీ చేసిన స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం జంతర్ మంతర్ స్థానంలో రామ్‌లీలా మైదాన్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్‌లను నిరసన వేదికలుగా గుర్తించారు. ఈ మూడు ప్రదేశాల్లో నిరసనల నిర్వహణకు సంబంధించి సవరించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌ఓపీ) విడిగా జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే, రామ్‌లీలా మైదాన్‌లో పరిమిత బుకింగ్ తేదీలు, అధిక అద్దె, ట్రాఫిక్ సమస్యలు నిరసనల నిర్వహణకు సవాళ్లుగా మారే అవకాశముంది. కొత్త వేదికల కేటాయింపుతో నిరసనకారులకు ఎంతవరకు సౌలభ్యం కలుగుతుందన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

©️ VIL Media Pvt Ltd.