
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ వన్డే ప్రపంచకప్ 2027 టికెట్లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్ బ్యాలెట్ ఓపెన్ చేసిన కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 1.5 కోట్లకు పైగా అప్లికేషన్స్ వచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ధ్రువీకరించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 14వ ఎడిషన్ వన్డే వరల్డ్‌కప్ పట్ల అభిమానుల్లో ఎంతటి ఉత్సాహం ఉందో ఈ దరఖాస్తుల వరద చాటిచెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 142 దేశాల నుంచి దాదాపు 44.23 లక్షల మంది అభిమానులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, మొత్తం 1,50,83,752 టికెట్ అప్లికేషన్లు దాఖలైనట్లు ఐసీసీ వెల్లడించింది.
అసలేంటీ వరల్డ్‌కప్ టికెట్ బ్యాలెట్ విధానం?
అధిక డిమాండ్ ఉన్న మెగా మ్యాచ్‌లకు టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఐసీసీ లాటరీ ఆధారిత బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తోంది. అభిమానులు తాము చూడాలనుకున్న నిర్దిష్ట మ్యాచ్‌లకు ఈ బ్యాలెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి ఒక మ్యాచ్‌కు ఒక్క బ్యాలెట్ ఎంట్రీ మాత్రమే వేయగలరు. అయితే టోర్నమెంట్‌లోని పలు వేర్వేరు మ్యాచ్‌లకు ఎంట్రీలు సమర్పించే వెసులుబాటు ఉంది. అందుబాటులో ఉన్న టికెట్ల సంఖ్య కంటే డిమాండ్ ఎక్కువ ఉన్న మ్యాచ్‌లకు రాండమైజ్డ్ బ్యాలెట్ పద్ధతి ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన దరఖాస్తుదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ లింక్ ఉపయోగించి వారు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్ 21, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.
అక్టోబర్ 7న భారత్ తొలి సమరం.. ఆసీస్‌తో రీమ్యాచ్..
వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రారంభమై నవంబర్ 21 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు తలపడనున్నాయి. వీటిని ఆరు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ -ఎ: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్, క్వాలిఫైయర్ -ఎ
గ్రూప్ – బి: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, క్వాలిఫైయర్- బి
టీమిండియా తన ప్రపంచకప్ వేటను అక్టోబర్ 7న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా ప్రారంభించనుంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుండటం విశేషం. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండటంతో ఈ పోరుపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం కూడా అభిమానులు రికార్డు స్థాయిలో టికెట్లకు పోటీ పడుతున్నారు.