Reading Time: < 1 minute
Rajinikanth: సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సినిమా రంగంలో ఎంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నా.. తన మూలాలను మర్చిపోని వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒకరు. వెండితెరపై తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉంటారు. తాజాగా తన గత జీవితాన్ని గుర్తుచేసుకుంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు తాను బస్సు కండక్టర్‌గా పనిచేసిన రోజులను ఇప్పటికీ మర్చిపోలేనని ఆయన చెప్పడం విశేషం. రజనీకాంత్ సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. సినిమాల్లోకి రాకముందు ఆయన సాధారణ జీవితాన్ని గడిపారు. బెంగళూరులో బస్సు కండక్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగించారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టి.. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్న చిన్న పాత్రల నుంచి కథానాయకుడిగా ఎదిగి, దక్షిణాది సినిమాలతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలోనూ తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే, ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ తన గతాన్ని మర్చిపోవడానికి రజనీకాంత్ ఇష్టపడరు. స్టార్‌డమ్ కంటే తన సాధారణ జీవితంలోని అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజా సినిమా ‘జైలర్ 2’కు సంబంధించిన కార్యక్రమంలో రజనీకాంత్ తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన వ్యక్తిత్వం గురించి ప్రస్తావించగా, రజనీ తన మనసులోని మాటలను పంచుకున్నారు. బస్సు కండక్టర్‌గా పనిచేసిన కాలం తన జీవితంలో ప్రత్యేకమైనదని ఆయన గుర్తుచేసుకున్నారు.

సుమారు ఐదేళ్లపాటు కండక్టర్‌గా పనిచేశానని, ఆ రోజులతో తనకు ఇప్పటికీ అనుబంధం ఉందని రజనీకాంత్ అన్నారు. అంతేకాదు, ఆ ఉద్యోగాన్ని ఇప్పటికీ మిస్ అవుతుంటానని, అందుకే తరచూ బెంగళూరుకు వెళ్తుంటానని ఆయన వెల్లడించినట్లు సమాచారం. తనను తాను పెద్ద స్టార్‌గా భావించకుండా, ఇప్పటికీ సాధారణ బస్సు కండక్టర్‌గానే ఊహించుకుంటాననే ఆయన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి, కోట్లాది మంది అభిమానించే స్థాయికి ఎదగడం అంత సులభమైన విషయం కాదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.