
సైబర్ నేరగాళ్ల తెలివికి ఏఐ కూడా షాకయ్యే పరిస్థితి. ఇన్నాళ్లు ఏదైనా మీరు నిర్వహించిన బ్యాంకు ట్రాన్జాక్షన్స్ కు సంబంధించి లేదా రోజూ వారీ కార్యకలాపాలకు సంబంధించిన మెస్సేజ్ పంపించి.. మీరు ట్రాన్జాక్షన్స్ చేసి ఉంటే ఎస్ అని రిప్లై ఇవ్వండి అనే వారు. YES అని రిప్లై ఇస్తే ఫోన్ హ్యాక్ చేయడం, బ్యాంక్ అకౌంట్ ను ఖాళీ చేయడం జరిగేది. అయితే ఇకపై నో కొట్టినా కూడా అదే జరుగుతుంది. ఆటో ఎక్జిక్యూషన్ ఫైల్ అటాక్ తో సైబర్ నేరగాళ్ల కొత్త పన్నాగం తెలిస్తే షాకవ్వాల్సిందే.
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హైద్రాబాద్ సీపీ సజ్జనార్ వీడియో సందేశం విడుదల చేశారు. ఎస్ అంటేనే కాదు.. ‘నో’ అంటే కూడా.. ఖాతా ఖాళీ అవుతుందని చెప్పారు. వాట్సాప్ మెసేజ్‌తోనే సైబర్ కేటుగాళ్ల కొత్త మోసానికి పాల్పడుతున్నట్లు చెప్పారు.
సైబర్ క్రిమినల్స్ OTP అడగరు.. లింక్ నొక్కించరు.. అయినా డబ్బులు మాయం.. అవుతాయి. గుర్తుతెలియని నంబర్ నుంచి బ్యాంక్ ఖాతా డెబిట్ అయిందంటూ ఫేక్ మెసేజ్ వస్తుంది. లావాదేవీ తాము చేయకపోతే ‘NO’ అని రిప్లై ఇవ్వాలంటూ కేటుగాళ్ల ఉచ్చు పన్నుతారు. కంగారులో ‘NO’ అని రిప్లై ఇస్తే మాల్‌వేర్ యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది. హిడెన్ లింక్స్, మాల్‌వేర్ స్క్రిప్ట్స్‌తో ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ చేస్తుంది. బాధితుల మొబైల్‌పై హ్యాకర్లకు నియంత్రణ లభించే అవకాశం ఉంటుంది.
►ALSO READ | నువ్వేమన్నా శంకర్ దాదా అనుకున్నావా డాక్టర్.. సికింద్రాబాద్లో బంగారం కొంటానని నమ్మించి..
చార్టర్డ్ అకౌంటెంట్ ఖాతా నుంచి లక్షల్లో నగదు స్వాహా చేసినట్లు పోలీసుల వెల్లడించారు. బ్యాంకింగ్ పేరుతో వచ్చే గుర్తుతెలియని వాట్సాప్ మెసేజ్‌లకు YES/NO కూడా రిప్లై ఇవ్వొద్దని చెప్పారు. అనుమానాస్పద నంబర్‌ను బ్లాక్ చేసి.. మెసేజ్‌ను డిలీట్ చేయాలని సూచించారు.
ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయని మెసేజ్ వస్తే.. అధికారిక బ్యాంకింగ్ యాప్‌లో స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవాలని సూచించారు. ఏ బ్యాంకూ వాట్సాప్‌లో YES/NO రిప్లై కోరదని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని పోలీసుల సూచించారు.
సైబర్ మోసాల్లో మొదటి గంటే గోల్డెన్ అవర్.. ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలని చెప్పారు. ‘కంగారులో ఇచ్చే ఒక్క NO.. జీవితకాల కష్టార్జితాన్ని తుడిచిపెట్టొచ్చు అని చెబుతున్నారు.