Reading Time: < 1 minute

ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? త్వరలో కీలక నిర్ణయం

Caption of Image.

హైదరాబాద్: ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కామన్ పాస్ ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. ప్రజల అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితులను పరిశీలించి, ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఛార్జీలను నిర్ణయించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

రోజువారీ పాస్ రూ.400.. నెలవారీ పాస్ రూ.8,500

ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు ప్రయాణికులపై ఆర్థిక భారం మోపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా ఉండగా, ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ వాటా రూ.100గా ఉంది. అదేవిధంగా నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించారు. ఇందులో మెట్రో వాటా రూ.7,000 కాగా, ఆర్టీసీ వాటా రూ.1,500గా ఉంది.

భట్టి విక్రమార్క సూచనలతో 

కామన్ పాస్ ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ఛార్జీలను పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ సమావేశంలో ప్రస్తుత ఛార్జీలు, ప్రయాణికుల అవసరాలు, ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రజలకు అందుబాటులో ఉండేలా కామన్ పాస్

ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆర్టీసీ, మెట్రో సేవలను ప్రజలు మరింత విస్తృతంగా వినియోగించుకునేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరేలా, వారి అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ధరలతో కామన్ పాస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.ప్రజలపై అదనపు ఛార్జీల భారం పడకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరల్లో మార్పులు ఉంటాయా? ప్రయాణికులకు ఎంతమేరకు ఊరట లభిస్తుంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.

 

©️ VIL Media Pvt Ltd.