Reading Time: 2 minutes
Prince Yadav Creates Rare T20i Record With 3 Fours In Just 6 Balls

Prince Yadav: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయంలో ప్రిన్స్ యాదవ్ చేసింది 13 పరుగులే అయినా కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 37 పరుగులు ఇచ్చిన అతడు.. బ్యాట్‌తో మాత్రం జట్టుకు విలువైన పరుగులు అందించాడు. నంబర్ 10లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రిన్స్ యాదవ్ కేవలం 6 బంతుల్లోనే 3 ఫోర్లతో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

భారత్ ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతోనే విజయం సాధించడంతో ప్రిన్స్ చేసిన 13 పరుగుల ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. అతడు చివర్లో బౌండరీలు బాదడంతో భారత్ 223 పరుగుల స్కోరు సాధించగలిగింది. ఈ మూడు ఫోర్లతో ప్రిన్స్ యాదవ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన జాబితాలో చేరాడు. నంబర్ 10 లేదా నంబర్-11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒక ఇన్నింగ్స్‌లో కనీసం మూడు బౌండరీలు బాదిన భారత బ్యాటర్లలో ప్రిన్స్ యాదవ్ ఇప్పుడు మూడో ఆటగాడిగా నిలిచాడు.

ఈ ప్రత్యేక ఘనత సాధించిన మిగిలిన ఇద్దరు భారత ఆటగాళ్లు ఎస్. శ్రీశాంత్, రవిచంద్రన్ అశ్విన్. శ్రీశాంత్ 2007లో న్యూజిలాండ్‌పై ఈ రికార్డు సాధించగా.. అశ్విన్ 2011లో ఇంగ్లాండ్‌పై కోల్‌కతా టీ20లో మూడు బౌండరీలు బాదాడు. అశ్విన్ తర్వాత దాదాపు 15 ఏళ్లకు నంబర్-10 లేదా 11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భారత ఆటగాడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో మూడు బౌండరీలు బాదడం ఇదే తొలిసారి.

మూడో టీ20లో భారత్ వెస్టిండీస్‌పై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకంతో అదరగొట్టగా.. అనంతరం భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. భారత్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. వెస్టిండీస్ పర్యటనలో లక్ష్యాన్ని కాపాడుకుని భారత్ విజయం సాధించడం ఇదే మొదటిసారి.