
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి? ఖాళీ అవబోతున్న మూడు సీట్ల భర్తీ విషయంలో సామాజిక సమీకరణాల లెక్కలు ఎలా ఉన్నాయి? ఆ సీట్ల మీద ఎవరి ఫోకస్ ఎక్కువగా ఉంది? కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
తెలంగాణ కౌన్సిల్‌లోని గవర్నర్ కోటా MLCలు ముగ్గురి పదవీ కాలం వచ్చే నెల ముగిస్తుంది. దీంతో… అధికార కాంగ్రెస్‌లో చాలా మంది ఈ సీట్ల మీద ఆశలు పెట్టుకున్నారు. ఇవైతే… ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, అధిష్టానం నుండి వత్తిళ్ళు… ఎలాంటి టెన్షన్స్ లేకుండా… పెద్దల సభలోకి అడుగు పెట్టవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు నేతలు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా… గవర్నర్ కోటాలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలని భావిస్తోందట. పట్టభద్రుల నియోజక వర్గాల సీట్లు రెండూ రెడ్డి సామాజిక వర్గం నేతలకు ఇవ్వడంతో… గవర్నర్ కోటాలో మాత్రం సామాజిక న్యాయం పాటించాలని డిసైడ్ అయినట్టు తెలిసింది.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎమ్మెల్సీని చేస్తామని ఆ మధ్య సిరిసిల్ల సభలో ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. దాంతో… బీసీ కోటాలో ఒక సీటు ఖాయమని అనుకుంటున్నారు. ఇక మిగిలిన రెండు సీట్లలో ఒకటి sc.. మరొకటి ocలకు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయట. ఐతే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. బీసీ లకు రెండు సీట్లు ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఆ కోటాలో ఒకటి పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తారు కాబట్టి… రెండో సీటును ముదిరాజ్‌లకు ఇవ్వాలనే ప్రతిపాదన వస్తోంది. అభ్యర్ధులు ఎవరన్న సంగతి తర్వాతగానీ… ముందు సామాజిక వర్గాల వారీగా లెక్కలు ముఖ్యమని అంటున్నారు. మూడింటిలో రెండు సీట్లను బీసీలకు ఇవ్వాలనే ఆలోచనను పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఇప్పటికే అధిష్టానానికి షేర్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలో మూడో సీటు ఎవరికి అనేది ఇప్పుడు అసలు చర్చగా మారింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వాలన్నది ఒక ప్రపోజల్. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ , దయాసాగర్, ఇన్సూరెన్స్ ఇంచార్జి పవన్ మల్లాది దాని కోసం పోటీ పడుతున్నారు. మరో వైపు గాంధీ భవన్ ఇన్ఛార్జ్, వెలమ సామాజిక వర్గానికి చెందిన కుమార్ రావు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారట. అలాగే… ఎస్సీ సామాజిక వర్గం నుండి చాలా మంది నేతలు MLc సీటు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉన్న మూడింట్లో రెండు బీసీలకు ఇవ్వాల్సి వస్తే… మిగిలిన ఆ ఒక్కటి ఎవరికి ఇస్తారు..? ఎవరిని పక్కనవేస్తారన్న చర్చ కూడా తెరమీదకు వచ్చింది. తలనొప్పి ఉండదు.. టెన్షన్ అసలే ఉండదు.. పెద్దల సభలోకి ఈజీగా వెళ్లొచ్చని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటుూ వత్తిడి తెస్తున్న క్రమంలో… కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.